High Court decision on Bandi Bhagirath bail petition: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై పోక్సో కేసు నమోదవ్వగా.. ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ఈ అంశంపై కోర్టులో తీవ్రస్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. పోక్సో కేసులో అరెస్ట్ నుండి మినహాయింపు కోరుతూ భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు.. ఈ కేసులో కీలకమైన బాధితురాలి పుట్టినరోజు తేదీలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. బాధితురాలి వాదన వినకుండా.. మధ్యంతర బెయిల్ మీద నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మధ్యంతరం బెయిల్‌పైన రేపు నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు.. ముందుస్తు బెయిల్‌ను మరో వారానికి వాయిదా వేసింది.
Also Read: https://teluguprabha.net/business/akash-ambani-as-jio-managing-director/
ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు కేసు పెట్టారు..
బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కుట్రతో కూడుకున్నదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విధానంలోనే పలు అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. భగీరథ్ కుటుంబం నుండి రూ. 5 కోట్లు వసూలు చేసేందుకు జరిగిన బ్లాక్‌మెయిల్‌పై కరీంనగర్‌లో తాము ముందే ఫిర్యాదు చేశామని, దానికి కౌంటర్‌గానే ఈ తప్పుడు కేసు పెట్టారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే గతంలో నమోదైన ఒక కేసు రికార్డుల ప్రకారం బాధితురాలు మైనర్ కాదని, మేజర్ అని వాదించారు. “ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు అధికారికంగా రికార్డ్ చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో బాధితురాలు చెప్పిన మరికొన్ని వాస్తవాలు, జరిగిన అన్యాయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే చట్టప్రకారం సెక్షన్లను సవరించడం జరిగిందని, ఇందులో ఎలాంటి కుట్ర లేదు” అని బాధితురాలి తరపు న్యాయవాది స్పష్టం చేశారు.

