iBOMMA Ravi Bail Petition: సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెయిల్ పిటిషన్ కోసం రవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్‌ను వాయిదా వేసింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/vijay-and-rashmika-marriage-date-buzz-is-26th-feb-2026/
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, ఈ పిటిషన్‌ను శుక్రవారాని(ఫిబ్రవరి 6)కి వాయిదా వేసింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కాగా, అంతకుముందు నాంపల్లి కోర్టులో రవి ఐదు బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. రవికి విదేశీ పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టు ఎదుట వాదించారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో నాంపల్లి కోర్టులో రవికి మొండి చేయి ఎదురు కాగా.. హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇమ్మడి రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/business/mg-cyberster-emerges-as-indias-top-sports-car-in-2025/
తెలుగు సినిమాలను హెచ్‌డీ క్వాలిటీతో పైరసీ చేస్తూ రూ. కోట్లు సంపాదించినట్లుగా రవిపై ఆరోపణలు ఉన్నాయి. దేశవిదేశాల్లో ఏజెంట్లను, సర్వర్లను ఉపయోగించి ఏకంగా పైరసీ సామ్రజ్యాన్నే నిర్మించిన రవిని పట్టుకోవడానికి ఒకానొక దశలో పోలీసులకే సవాలుగా మారింది. ఒక ఇ- మెయిల్ లింక్ ఆధారంగా నిఘా పెట్టిన పోలీసులు.. రవి హైదరాబాద్‌లో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే విదేశీ డేటా గురించి సమాధానాలు దాటవేస్తుండటంతో కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

