High Court serious on fake pattas for government lands: ప్రభుత్వ భూములకు నకిలీపట్టాల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. దొంగ పట్టాల సృష్టిపై సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఖానామెట్ భూములకు నకిలీ పట్టాలు సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భూమి తనదంటూ పిటిషన్ దాఖలు చేసిన ఇట్టిగా ప్రాపర్టీస్‌కు రూ.5 లక్షల జరిమానా విధించింది. నకిలీ పట్టాల వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపైనా సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.
నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు..
ఈ వ్యవహారంపై ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి నిందితులను గుర్తించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు. కాగా, గతంలో టీజీఐఐసీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఇట్టిగా ప్రాపర్టీస్ అనే సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. ఖానామెట్‌లో 15 ఎకరాలను కొనుగోలు చేశామని పిటిషన్ వేసింది. అయితే, ఖానామెట్‌లో ఈ భూమిని 1997లోనే టీజీఐఐసీకి ప్రభుత్వం కేటాయించినట్లు తేలింది. దీంతో, పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

