హైదరాబాద్, సెప్టెంబర్ 7(తెలుగుప్రభ): అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ‘హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం.. 1000 రోజుల పాలన నిష్ఫలం’ అనే నినాదాలు ఉన్న టీషర్టులతో సభలోకి అనుమతించరాదని స్పీకర్ ఆదేశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు టీషర్టులు విప్పి బనీన్లతోనే లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, యాదవరెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులకు స్వల్ప గాయాలైనట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపించింది. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని పార్టీ కార్యాలయానికి తరలించారు.
అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే : హరీశ్ రావు
ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది శాసన సభనా? లేక కౌరవ సభనా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళా శాసనసభ్యుల చీరలు లాగుతారా? ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి అని నిలదీశారు. పోలీసు రాజ్యం నడుపుతున్నావా? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని పేర్కొన్నారు. అదానీ బొమ్మలతో కూడిన నల్ల టీషర్టు వేసుకొని రాహుల్ గాంధీ, ప్రియాంక పార్లమెంట్‌కు వెళ్తే తప్పులేదు కానీ తాము వేసుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తమను ఎందుకు అడ్డుకున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. మహిళా సభ్యుల చీరలు లాగిన పోలీసులను సప్త సముద్రాల ఆవల ఉన్నా వదిలి పెట్టమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై చర్చ అంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతున్నదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీ రియింబర్స్ మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల గురించి అసెంబ్లీలో తాము మాట్లాడకుండా గొంతు నొక్కారన్నారు. వెయ్యి రోజుల విఫల పాలన వాస్తవాలు బట్ట బయలు అవుతాయని భయపడ్డారని, అందుకే తమపై పోలీసులను ప్రయోగించి అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడ్డ ఎమ్మెల్యేలను ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? అని నిలదీశారు. కేటీఆర్ చేయి, ముఖం మీద గీరుకుపోయిందని, యాదవ రెడ్డి కుడి కాలు గోరు పోయిందని, రాజశేఖర రెడ్డి కాలు కమిలి పోయిందని, సంజయ్ చేతికి దెబ్బ తగిలిందని తెలిపారు. హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హరీశ్‌రావు హెచ్ఛరించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నామమాత్రపు చర్చ పెడతారా? అని నిలదీశారు.
అభయహస్తం.. భస్మాసుర హస్తం : కేటీఆర్
గన్ పార్క్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అభయహస్తం.. ఎన్నికల తర్వాత భస్మాసుర హస్తం అయ్యిందని ఎద్దేవా చేశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సబ్బండ వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసిచ్చారని, వెయ్యి రోజులైనా ఇప్పటిదాకా హామీలు నెరవేర్చలేదన్నారు. అందుకే శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్‌ను ఎండగట్టాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి సభలో అవమానించినా ప్రజల కోసం హామీల అమలును ప్రశ్నించండని సూచించారన్నారు. తమ పార్టీపైన కాంగ్రెస్, బీజేపీ కుట్రలు కొత్త కాదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి తరఫున కాంగ్రెస్‌కు ఈ సమావేశాల్లో పలు ప్రశ్నలు అడుగుతామన్నారు. నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యల పైన కూలంకషంగా చర్చ జరగాలన్నారు. ముఖ్యమంత్రి మంత్రుల బంధువులకు అక్రమ భూ కేటాయింపులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అన్నింటిపైనా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ వివరించారు.

