Hit and Run Compensation Scheme : రోడ్డు ప్రమాదంలో గాయపరిచి, మానవత్వం లేకుండా పారిపోయే ‘హిట్ అండ్ రన్’ ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. వాహనం ఎవరో తెలియక, నిందితులు దొరక్క, బాధితుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాయి. ఇలాంటి అభాగ్యులను ఆదుకునేందుకు ఓ ప్రభుత్వ పథకం ఉందని, దాని ద్వారా లక్షలాది రూపాయల పరిహారం పొందవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి ఇలాంటి ప్రమాదంలోనే మరణించినా, పథకం గురించి తెలియక ఆయన కుటుంబం పరిహారం పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో, ఎందరికో తెలియని ఈ ‘హిట్ అండ్ రన్ పరిహార పథకం’పై ప్రత్యేక కథనం.
గుర్తు తెలియని వాహనం ఢీకొని పారిపోయే (హిట్ అండ్ రన్) కేసులలో, బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఎంత పరిహారం వస్తుంది : ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చుల కింద రూ.50,000 వరకు పరిహారం అందుతుంది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు.
పరిహారం పొందడం ఎలా? ప్రక్రియ ఇదే : ఈ పథకం ద్వారా సహాయం పొందడానికి, బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు కొన్ని దశలను అనుసరించాలి. ప్రమాదం జరిగిన వెంటనే, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి (FIR), దర్యాప్తు ప్రారంభిస్తారు.
ఆర్డీఓకు దరఖాస్తు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి లేదా మరణించిన వారి కుటుంబ సభ్యులు, ‘ఫాం-1’ ద్వారా సంబంధిత ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్)కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ వంటివి జత చేయాలి.
అధికారుల విచారణ: ఆర్డీఓ విచారణ జరిపి, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపుతారు. కలెక్టర్ కార్యాలయంలోని ‘క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ కమిషనర్’ తుది విచారణ జరిపి, పరిహారాన్ని మంజూరు చేస్తారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత, సాధారణంగా 15 రోజుల్లో పరిహారం మొత్తం నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం : “ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపే ఈ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గడువు దాటితే పరిహారం పొందే అవకాశాన్ని కోల్పోతారు.”
– నాగబాబు, సీఐ, మణుగూరు
అవగాహన కల్పించాల్సిన అవసరం : పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చే ఈ పథకం గురించి చాలామందికి తెలియదు. దీనిపై ప్రభుత్వం, మీడియా, పోలీసు, రెవెన్యూ శాఖలు గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

