Massive arrangements for fish prasadam distribution: మృగశిర కార్తె సందర్భంగా ఈనెల 8న ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఇచ్చే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, షాట్ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రౌండ్ అంతా తిరిగి బారికేడ్లను, క్యూ లైన్లను నిశితంగా పరిశీలించారు.
దేశం నలుమూల నుంచి వచ్చే ఛాన్స్..
ఈసారి చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ 8వ తేదీ రాత్రి 9 గంటలకే ప్రారంభం అవుతుండటంతో, దేశం నలుమూలల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా క్యూలైన్లలో తొక్కిసలాట లాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలన్నారు. అలాగే చేప ప్రసాదం పంపిణీ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో భారీ ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also read: MP Chamala: ప్రైవేటు సంభాషణలు కూడా విన్నారు.. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ అధికారులతో ఎంపీ చామల
క్యూలైన్లలో అన్ని ఏర్పాట్లు చేయాలి..
భక్తుల రక్షణ, సౌకర్యాల కోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంచుకోవాలని, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులను అందుబాటులో ఉంచడంతో పాటు, అవసరమైన మందులతో మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. క్యూలైన్ల మధ్యలోనే అత్యవసర చికిత్స అందించేలా సీపీఆర్ బృందాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్ వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలోకి దించాలని, జేబుదొంగతనాలు జరగకుండా ప్రజలను మైకుల ద్వారా అలర్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. గ్రౌండ్ అంతా సీసీ కెమెరాల నిరంతర నిఘాలో ఉండాలన్నారు. తాగునీటి కొరత రాకుండా చూడాలని, బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ప్రతి ఏటా నిర్వహిస్తున్న చేప మందు ప్రసాదం ఈ ఏడాది కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

