హైదరాబాద్, నవంబర్ 5 (తెలుగు ప్రభ): జిల్లాలో బాలల హక్కుల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బాలల హక్కులపై సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు, వారి సమస్యల పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యతను పెంచేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 16న ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ భాగస్వామ్యంతో పనిచేస్తున్న అలయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ (ఏసీఆర్), రాష్ట్ర నోడల్ సంస్థ ‘మహిత’ సహకారంతో ఈ కార్యక్రమం జరగనుంది. సాధారణ ప్రజావాణి జరిగే ప్రాంగణంలో పిల్లల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదిక ద్వారా పిల్లలు తమ విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల లబ్ధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చు. వినతిపత్రాలు కూడా సమర్పించవచ్చు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, వేధింపులు, దోపిడీ వంటి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. అందిన వినతులపై సంబంధిత శాఖల సమన్వయంతో తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
జిల్లాలో పిల్లల సంక్షేమం, సంరక్షణ, సమగ్ర అభివృద్ధి కోసం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వివిధ కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తోంది. ఈ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారి హక్కుల పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ‘పిల్లల ప్రజావాణి’ ప్రధాన లక్ష్యం. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కోరుతోంది.

