Hyderabad Municipal Reorganization : తెలంగాణ గుండెకాయ, విశ్వనగరం హైదరాబాద్ పాలనా స్వరూపం సమూలంగా మారిపోనుంది. దశాబ్దన్నర కాలానికి పైగా ఒకే గొడుగు కింద ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చరిత్రలో ఫిబ్రవరి 10వ తేదీ ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న భౌగోళిక సరిహద్దులు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విభజనతో నగర రూపురేఖలు ఎలా మారబోతున్నాయి..? ఏయే ప్రాంతాలు ఏ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి…? అసలు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యేకాధికారి పాలన ఎందుకు వస్తోంది? ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి…?
మూడు ముక్కల ముచ్చట.. సరికొత్త లెక్కలు : ప్రస్తుతం 1.34 కోట్ల జనాభాతో, 300 డివిజన్లతో దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా ఉన్న జీహెచ్‌ఎంసీని విభజించడం ద్వారా ప్రజలకు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని ప్రభుత్వం భావిస్తోంది. దీని ప్రకారం నగర పాలన మూడు ప్రధాన కేంద్రాలుగా సాగనుంది.
హైదరాబాద్ కార్పొరేషన్ (GHMC): ఇది పాత నగరంతో పాటు ప్రధాన ప్రాంతాలను కలిగి ఉంటుంది. దీని పరిధిలోకి శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లు వస్తాయి. ఇది కేవలం 6 జోన్లకే పరిమితం కానుంది.
మల్కాజిగిరి కార్పొరేషన్ (MMC): తూర్పు హైదరాబాద్‌ను కలుపుతూ మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లతో ఇది ఏర్పడనుంది.
సైబరాబాద్ కార్పొరేషన్ (CMC): ఐటీ హబ్‌గా పేరొందిన పశ్చిమ భాగాన్ని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో ప్రత్యేక కార్పొరేషన్‌గా తీర్చిదిద్దనున్నారు.
17 ఏళ్ల తర్వాత ‘ప్రత్యేకాధికారి’ పాలన : ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియనుండటంతో, నగరంలో మళ్లీ 2008 నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయి. చివరిసారిగా 2008 నుంచి 2009 వరకు ఎస్.పి. సింగ్ కమిషనర్ మరియు ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం మళ్లీ అధికారులకే పాలనా పగ్గాలు అప్పగించనుంది. ఇది రాజకీయంగా కూడా పెను మార్పులకు సంకేతం కానుంది.
పోలీస్ సరిహద్దులతో మున్సిపల్ అనుసంధానం : పరిపాలనలో సమన్వయం కోసం ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులకు అనుగుణంగానే ఈ మూడు కార్పొరేషన్ల సరిహద్దులను కూడా నిర్ణయించారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ మధ్య మంచి సమన్వయం ఉంటుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
వ్యాప్తి – జనాభా గణాంకాలు: పాత గ్రేటర్ పరిధిలో జనాభా సాంద్రత అధికంగా ఉండటం వల్ల 150 డివిజన్లు ఉన్న చోట ఇప్పుడు పునర్విభజనలో అవి 253కు చేరాయి. శివారు ప్రాంతాల్లోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసినా అక్కడ జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. కొత్తగా ఏర్పడే మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో సగటున 35 లక్షల జనాభా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

