Cyber Crime Gang Busted in Hyderabad : సాంకేతికతకు చిరునామా అయిన హైటెక్ సిటీని కొందరు కేటుగాళ్లు తమ నేరాలకు అడ్డాగా మార్చుకున్నారు. పైకి కార్పొరేట్ కాల్ సెంటర్.. లోపల మాత్రం అంతర్జాతీయ స్థాయి దోపిడీ! ఖమ్మం నుంచి కోల్‌కతా వరకు నెట్‌వర్క్ విస్తరించి, మాదాపూర్ నుంచి మెల్బోర్న్ వరకు వల విసిరారు. సాఫ్ట్‌వేర్ సమస్యల పేరుతో ఆస్ట్రేలియన్లను బురిడీ కొట్టిస్తూ, రెండేళ్లలోనే ఏకంగా రూ.10 కోట్లు కొల్లగొట్టారు. విదేశీ యాసలో మాట్లాడేందుకు బెంగాలీ యువకులను రప్పించి, హవాలా మార్గంలో డబ్బును మళ్లించిన ఈ ‘కిలాడీ’ ముఠా కథ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఖమ్మం స్కెచ్ – కోల్‌కతా బ్యాచ్ : ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్, ప్రకాశ్‌లు ఈ భారీ మోసానికి సూత్రధారులు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో అంతర్జాతీయ సైబర్ మోసాలకు తెరలేపారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను తమ సొంత జిల్లాకే చెందిన గణేశ్, చెన్నకేశవలకు అప్పగించారు. అయితే, ఆస్ట్రేలియన్లను నమ్మించాలంటే ఆ దేశపు యాస (Accent) తప్పనిసరి. ఇందుకోసం కోల్‌కతాకు చెందిన ఏడుగురు యువకులను ప్రత్యేకంగా టెలీ కాలర్లుగా నియమించుకున్నారు.
మోసం ఇలా.. (Modus Operandi) : వీరి దందా అంతా ‘టెక్ సపోర్ట్’ ముసుగులో సాగుతుంది:
డేటా చోరీ: ముందుగా ఆస్ట్రేలియా పౌరుల ఈ-మెయిల్ ఐడీలు, వ్యక్తిగత వివరాలను డార్క్ వెబ్ లేదా ఇతర మార్గాల ద్వారా సేకరిస్తారు.
పాపప్స్ (Pop-ups): బాధితులకు నకిలీ మెయిల్స్ లేదా కంప్యూటర్‌లో వైరస్ ఉందంటూ పాపప్స్ పంపిస్తారు. “సమస్య పరిష్కారానికి ఈ నెంబర్‌ను సంప్రదించండి” అని ఓ నెంబర్ ఇస్తారు.
రూటింగ్: బాధితులు ఆ నెంబర్‌కు కాల్ చేయగానే, ‘వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్’ (VoIP) ద్వారా ఆ కాల్ మాదాపూర్ కాల్ సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది. దీనికోసం ‘ఎక్స్‌లైట్’ (X-Lite) యాప్‌ను వాడారు.
యాక్సెస్: సమస్య పరిష్కరిస్తామంటూ నమ్మబలికి, ‘ఎనీడెస్క్’ (AnyDesk) వంటి రిమోట్ యాక్సెస్ యాప్స్ ద్వారా వారి కంప్యూటర్‌ను హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేస్తారు. చివరగా వారి బ్యాంక్ వివరాలు సేకరించి డబ్బులు మాయం చేస్తారు.
‘స్టూడెంట్’ ఖాతాలే సేఫ్ జోన్ : డబ్బును నేరుగా ఇండియాకు రప్పించుకుంటే దొరికిపోతామని గ్రహించిన ఈ ముఠా, మరో కొత్త దారిని ఎంచుకుంది. ఆస్ట్రేలియాలో చదువు ముగించుకుని భారత్‌కు తిరిగి వస్తున్న విద్యార్థులే వీరి టార్గెట్. ఆయా దేశాల్లో వారు వాడిన బ్యాంక్ ఖాతాలను కమీషన్ పద్ధతిలో స్థానిక ఏజెంట్ల ద్వారా సేకరిస్తారు. బాధితుల ఖాతాల నుంచి కొట్టేసిన డబ్బును ముందుగా ఈ విద్యార్థుల ఖాతాల్లోకి మళ్లిస్తారు. అక్కడి నుంచి హవాలా మార్గంలోనూ, క్రిప్టో కరెన్సీ రూపంలోనూ ఇండియాకు రప్పించుకుంటారు. ఇలా రెండేళ్లలో సుమారు రూ.10 కోట్లు దండుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
పక్కా సమాచారంతో దాడి : మాదాపూర్‌లోని సదరు కాల్ సెంటర్‌లో ఉద్యోగుల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఓ వ్యక్తి బాలానగర్ ఎస్వోటీ (SOT) పోలీసులకు సమాచారం అందించారు. లోపలంతా బెంగాలీ వ్యక్తులే ఉండటం, రాత్రి వేళల్లోనే కార్యకలాపాలు సాగుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. పక్కా ఆధారాలతో శనివారం దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్నవి: 1 కారు, 12 కంప్యూటర్లు, 21 స్మార్ట్ ఫోన్లు, నకిలీ స్టాంపులు, పాస్‌పోర్టులు.
కంప్యూటర్లలో 45 ఆస్ట్రేలియా బ్యాంక్ ఖాతాల వివరాలు లభ్యమయ్యాయి. ప్రధాన సూత్రధారులైన ప్రవీణ్, ప్రకాశ్‌లు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర వెల్లడించారు.

