Yellow alert: రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గంటకు 60 కి.మీ.వేగంతో గాలులు: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read-Kerala: వయనాడ్‌లో మళ్లీ ప్రకృతి ప్రకోపం.. విరిగిపడిన కొండచరియలు
రైతులకు పలు సూచనలు: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే అయినప్పటికీ బలమైన గాలుల కారణంగా అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోప్రజలు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

