HomeతెలంగాణScam : క్యూనెట్ కంత్రీల కొత్త కితకితలు.. 'ఇగ్నైట్' పేరుతో పాత ముఠా పక్కా ప్లాన్...

Scam : క్యూనెట్ కంత్రీల కొత్త కితకితలు.. ‘ఇగ్నైట్’ పేరుతో పాత ముఠా పక్కా ప్లాన్ పటాపంచల్!

Ignite MLM Scam Hyderabad Police : రంగులు మార్చే ఊసరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా.. పాత సీసాలో కొత్త సారా పోసి జనాన్ని బురిడీ కొట్టించేందుకు ఓ అంతర్జాతీయ కేటుగాళ్ల ముఠా సరికొత్త ఎత్తుగడ వేసింది. పాతికేళ్లుగా ‘క్యూనెట్’, ‘గోల్డ్‌క్వెస్ట్’ వంటి పేర్లతో లక్షలాది మంది నెత్తిన టోపీ పెట్టిన ఘనులు, ఇప్పుడు రూపు రేఖలు మార్చుకుని ‘ఇగ్నైట్’ ( పేరుతో మళ్లీ రంగంలోకి దిగారు. సామాన్యుల కష్టార్జితాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించేలా ఏకంగా రూ. 5 వేల కోట్ల భారీ స్కామ్‌కు తెరలేపారు. అయితే, వారు పన్నిన పక్కా ప్లాన్‌ను హైదరాబాద్‌ సీసీఎస్ (CCS) పోలీసులు పసిగట్టి కేవలం 18 రోజుల్లోనే పటాపంచలు చేశారు. 

- Advertisement -

కొత్త అవతారం.. పక్కా ప్రణాళిక: గతంలో క్యూనెట్ (QNet) పేరిట దేశవ్యాప్తంగా వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆ పాత నేరస్థులే పోలీసుల కళ్లుగప్పేందుకు సరికొత్త వ్యూహం పన్నారు. మే 18వ తేదీన చండీగఢ్ కేంద్రంగా ‘ఇండీకనెక్ట్ వెంచర్స్’ అనే డమ్మీ సంస్థను రిజిస్టర్ చేశారు. ఆ ముసుగులో ‘ఇగ్నైట్’ (Ignite) అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) చైన్ లింక్ దందాను ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా వాట్సాప్ గ్రూపులు, జూమ్ కాల్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. ప్రముఖ షాపింగ్ మాల్స్‌ను సైతం తమ ప్రచార వేదికలుగా వాడుకున్నారు.

రూ.600ల బ్రష్.. రూ.60 వేల దోపిడీ : ఈ ముఠా జనాలను ఏమార్చే విధానం అత్యంత వినూత్నంగా, దిగ్భ్రాంతికరంగా ఉంది. మార్కెట్లో కేవలం రూ.600 విలువ చేసే ఓ సాధారణ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను చేతిలో పెట్టి, సభ్యత్వ రుసుము  కింద ఏకంగా రూ. 60 వేలు వసూలు చేశారు. ఇక్కడితో ఆగకుండా, ముందుగా చేరిన వారు తమ కింద మరికొంత మందిని చేర్పిస్తే భారీగా కమీషన్లు వస్తాయని గొలుసుకట్టు ఆశలు చూపారు. చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టుకున్న సామాన్యుల సొమ్మును రాత్రికి రాత్రే స్వాహా చేసేందుకు వల పన్నారు.

18 రోజుల్లోనే పోలీసుల మెరుపుదాడి: ఈ దందా నెమ్మదిగా హైదరాబాద్‌లో కాలుమోపుతున్న తరుణంలోనే ఎస్ఆర్ నగర్, కాచిగూడ, పంజాగుట్ట పోలీసు స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన సీసీఎస్ (CCS) పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఇదో భారీ అంతర్జాతీయ కుట్రగా తేలడంతో దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. కేరళ, ఉత్తరప్రదేశ్, దిల్లీ తదితర రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి, నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న ఆరుగురు కీలక నిందితులను సంస్థ ప్రారంభించిన 18 రోజుల్లోనే అరెస్టు చేశారు.

క్రిప్టో రూపంలో విదేశాలకు నిధులు: దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ ముఠా బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల సొమ్మును షెల్ కంపెనీల ద్వారా ఏడు దశలుగా మార్చారు. ఆ తర్వాత ఆ బ్లాక్ మనీని హవాలా మార్గంలో క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి నేరుగా హాంగ్‌కాంగ్‌కు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంతర్జాతీయ మనీలాండరింగ్ కోణాన్ని పూర్తిగా ఛేదించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో  సమన్వయం చేసుకుంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: “రూ.5 వేల కోట్ల మేరకు మోసం చేసే ప్లాన్ వారి దగ్గర ఉంది. గతంలోనూ ఇదే ముఠా రూ.7500 కోట్ల వరకు మోసం చేసింది. లక్షల్లో బాధితులున్నారు. 2001 నుంచే వివిధ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. మీరు జాయిన్ అయ్యాక మరొకరిని చేర్చుకోవాలని కోరితే అది పక్కా మోసమని గ్రహించి అప్రమత్తం కావాలి. చట్టరీత్యా గొలుసుకట్టు వ్యాపారాలు నేరం” అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఈజీ మనీకి ఆశపడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News