Highest land price in Hyderabad : భాగ్యనగరంలో భూమి ‘బంగారం’ అన్న మాట పాతబడిపోయింది.. ఇప్పుడు అది ‘వజ్రం’ కన్నా విలువైనదిగా మారిపోయింది! నిన్న మొన్నటి వరకు ఎకరం రూ.100 కోట్లు అంటేనే నోరెళ్లబెట్టిన రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ఇప్పుడు తాజా వేలం ధర చూసి అవాక్కవుతున్నారు. సరిహద్దులు చెరిపేస్తూ, పాత రికార్డులను తుడిచేస్తూ హైదరాబాద్ రియాల్టీ రంగం విశ్వరూపం ప్రదర్శించింది. రాయదుర్గం సాక్షిగా అక్షరాలా ఎకరం భూమి ధర రూ.237 కోట్లు పలికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రికార్డుల వేట: రూ.1,490 కోట్ల మెగా డీల్ : తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) గురువారం నిర్వహించిన ఈ-వేలంలో రాయదుర్గం గ్రోత్ కారిడార్‌లోని ప్లాట్ నంబరు 1A, 1/F (సర్వే నంబరు 83/1) చరిత్ర సృష్టించింది. మొత్తం 6.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మల్టీ-యూజ్డ్ భూమి కోసం దేశంలోని దిగ్గజ డెవలపర్లు పోటాపోటీగా బిడ్లు వేశారు.
రిజర్వ్ ధర: ఎకరాకు రూ.139 కోట్లుగా నిర్ణయించగా..
ముగింపు ధర: ఎకరాకు రూ.237.00 కోట్లు.
మొత్తం విక్రయ విలువ: రూ.1,490.73 కోట్లు.
హైదరాబాద్‌కు చెందిన గౌర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ అత్యంత ఖరీదైన భూమిని దక్కించుకుంది. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ ‘జేఎల్ఎల్’ (JLL) ఈ లావాదేవీకి అడ్వైజర్‌గా వ్యవహరించడం గమనార్హం.
మౌలిక వసతులే ఊపిరిగా : గతంలో 2022లో కోకాపేట నియోపొలిస్‌లో ఎకరం రూ.100.75 కోట్లు పలికితేనే అది పెద్ద సంచలనం. ఆ తర్వాత గతేడాది అక్టోబరులో రూ.177 కోట్లకు చేరింది. ఇప్పుడు కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఆ రికార్డు కనుమరుగై రూ.237 కోట్లకు చేరడం చూస్తుంటే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎంత వేగంగా ఎదుగుతుందో అర్థం చేసుకోవచ్చు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి మధ్య ఉండటం, అత్యుత్తమ రవాణా సౌకర్యాలు, ఐటీ రంగ విస్తరణ ఈ ప్రాంతాన్ని ‘గోల్డెన్ కారిడార్’గా మార్చాయి.
రావిర్యాలలోనూ కాసుల వర్షం : కేవలం ఐటీ కారిడార్‌లోనే కాకుండా, ఎయిర్ పోర్ట్ సమీపంలోని ప్రాంతాల్లోనూ ధరలు రెక్కలు తొడుగుతున్నాయి. మహేశ్వరం మండలం రావిర్యాలలో హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలంలో: చదరపు గజం గరిష్ఠంగా రూ.83,500 పలికింది. కేవలం 4 ల్యాండ్ పార్శిళ్ల ద్వారా ప్రభుత్వానికి రూ.140 కోట్ల ఆదాయం సమకూరింది. కనీస ధర రూ.26,000 ఉండగా, మూడు రెట్లు అధికంగా ధర పలకడం విశేషం.
ముందుంది మరిన్ని వేలం పాటలు : రాయదుర్గంలోనే ప్లాట్ నంబర్ పీ4 పరిధిలోని 5.09 ఎకరాలకు జూన్ ఒకటో తేదీన ఈ-వేలం జరగనుంది. తాజా రికార్డు నేపథ్యంలో ఆ వేలంలో ధరలు ఇంకెంత స్థాయికి చేరుతాయోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించిందన్న అంచనాలను తలకిందులు చేస్తూ, తాజా ఫలితాలు కొత్త ఊపిరిని పోశాయి.

