ACB Raids on Hyderabad RTA Offices: ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రజలకు సేవ చేసే వేదిక కావాలి. కానీ, హైదరాబాద్‌లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (RTA) మాత్రం ‘ఏజెంట్ల అడ్డాలు’గా మారిపోయాయి. సామాన్యుడు నేరుగా వెళ్తే సాగని పని.. ఏజెంట్ ద్వారా వెళ్తే క్షణాల్లో పూర్తవుతోంది. “చేతులు తడిపితే చాలు.. నిబంధనలు తుంగలో తొక్కి లైసెన్సులు నేరుగా జేబులోకి వస్తాయి” అన్న చందంగా తయారైంది అక్కడి పరిస్థితి. కొండాపూర్, మేడ్చల్, నాగోల్ కార్యాలయాలపై బుధవారం ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు మెరుపు దాడులు నిర్వహించినప్పుడు బయటపడ్డ నిజాలు చూసి విస్తుపోవడం అధికారుల వంతైంది.
ఏ కార్యాలయంలో ఏం జరిగింది : ఏసీబీ తనిఖీల్లో వెల్లడైన విస్మయకర అంశాలను నిశితంగా పరిశీలిస్తే, అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో అర్థమవుతుంది. ప్రతి కార్యాలయంలోనూ ఒక ప్రత్యేకమైన ‘అవినీతి నమూనా’ (Corruption Model) అమలవుతోంది.
మేడ్చల్: కోడ్ భాషలో దరఖాస్తులు : మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలోని డ్రైవింగ్ ట్రాక్ వద్ద ఏసీబీ అధికారులు ఒక వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నాలుగు దరఖాస్తులు ఉన్నాయి. కానీ, ఆ దరఖాస్తుదారులు అక్కడ లేరు. విచారణలో అతను ఒక డ్రైవింగ్ స్కూల్ యజమాని అని, ఎల్ఎల్ఆర్ (LLR) ఇప్పించేందుకు భారీగా వసూలు చేస్తున్నాడని తేలింది.
గుట్టురట్టు: దరఖాస్తులను పరిశీలించగా, వాటిపై కొన్ని ప్రత్యేకమైన కోడ్లు, ఏజెంట్ల పేర్లు రాసి ఉన్నాయి. అంటే, ఆ కోడ్ కనిపిస్తే చాలు.. అధికారులు ఎలాంటి విచారణ లేకుండానే ఫైళ్లను ముందుకు కదిలిస్తారన్నమాట. ఇది అధికారులకూ, ఏజెంట్లకూ మధ్య ఉన్న ‘అపవిత్ర బంధానికి’ నిదర్శనం.
కొండాపూర్: పోస్టులో వెళ్లాల్సిన కార్డులు ఏజెంట్ల చేతుల్లో : సాధారణంగా డ్రైవింగ్ లైసెన్సులు లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RC) పోస్ట్ ద్వారా దరఖాస్తుదారుడి ఇంటికి చేరాలి. కానీ కొండాపూర్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం.
నిర్లక్ష్యం వెనుక పరమార్థం: ఏసీబీ అధికారులు ఏజెంట్ల నుంచి సుమారు 150 ఆర్సీ, డీఎల్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు కావాలనే వీటిని పోస్ట్ చేయకుండా, కమీషన్ల కోసం నేరుగా ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. డ్రైవింగ్ టెస్ట్ సమయంలో అభ్యర్థి నైపుణ్యాన్ని పరీక్షించాల్సిన అధికారులు, కేవలం ఏజెంట్ల సిఫార్సులనే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తేలింది.
నాగోల్: అడ్డూఅదుపూ లేని ఏజెంట్ల హవా : నాగోల్ కార్యాలయంలో ఏసీబీ జరిపిన సోదాల్లో ఏడుగురు డ్రైవింగ్ స్కూల్ యజమానులు, ఎనిమిది మంది ఇన్స్ట్రక్టర్లు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 41,130 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
షాకింగ్ నిజం: సుధాకర్ రెడ్డి అనే ఒక్క ఏజెంట్ వద్దే ఏకంగా 184 లైసెన్సులు లభ్యమయ్యాయి. అంటే సామాన్యుడికి చేరాల్సిన ప్రభుత్వ పత్రాలు ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లో బందీ అయ్యాయి.
ట్రాక్ మేనేజ్మెంట్: బుధవారం వచ్చిన 185 దరఖాస్తుల్లో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాకపోవడం గమనార్హం. ప్రతి దరఖాస్తుపై డ్రైవింగ్ స్కూల్ వాహనం నంబర్ ఉండటమే దీనికి కారణం. ఇది ఒక రకమైన ‘నిశ్శబ్ద ఒప్పందం’గా అధికారులు గుర్తించారు.

