Hyderabad Tourism Popularity Analysis : హైదరాబాద్: భాగ్యనగరం.. చారిత్రక కట్టడాలకు, ఆధునిక వినోదానికి, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. పర్యాటక పటంలో హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతోంది. నగరంలోని వైవిధ్యభరితమైన పర్యాటక కేంద్రాలు ప్రతి ఏటా లక్షలాది మందిని ఆకర్షిస్తూ, పర్యాటక రంగ ఆదాయాన్ని పెంచుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ విడుదల చేసిన 2025 గణాంకాలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాయి.
సందర్శకుల తొలి ఛాయిస్.. జూపార్కే : హైదరాబాద్ పర్యాటక రంగంలో ‘నెహ్రూ జూలాజికల్ పార్క్’ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఏటా 20 లక్షల మందికి పైగా సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా వేసవి, శీతాకాల సెలవుల్లో ఇక్కడ పర్యాటకుల రద్దీ వెల్లువలా ఉంటుంది. వన్యప్రాణులను, అడవి వాతావరణాన్ని దగ్గరగా చూడాలనుకునే చిన్నారులు, ప్రకృతి ప్రేమికులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana/tg-good-news-for-farmers/
రెండో స్థానంలో హుస్సేన్‌సాగర్ తీరం : హుస్సేన్‌సాగర్ సమీపంలోని ‘లుంబినీ పార్క్’ రెండో స్థానంలో నిలిచింది. లేజర్ షో, బోటింగ్ సదుపాయాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. మే నెల ఒక్క నెలలోనే దాదాపు 2.66 లక్షల మంది ఇక్కడ సందడి చేయడం గమనార్హం. సగటున ప్రతీ నెలా లక్షకు పైగా పర్యాటకులు ఇక్కడికి రావడం విశేషం.
ఇతర ప్రధాన ఆకర్షణలు ఇవే : హైదరాబాద్ నగరం పర్యాటక కేంద్రాల సమ్మేళనంగా విరాజిల్లుతోంది:
ఎన్టీఆర్ గార్డెన్: కుటుంబ విహారాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఈ గార్డెన్‌ను మే నెలలో దాదాపు 1.98 లక్షల మంది సందర్శించారు.
శిల్పారామం: కళలు, హస్తకళల కేంద్రంగా పర్యాటకుల మనసు గెలుచుకుంటోంది. పండుగ సీజన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
గోల్కొండ కోట: చారిత్రక వైభవానికి నిదర్శనమైన ఇక్కడ, ప్రతి నెలా 80 వేల నుంచి 1.7 లక్షల మంది సందర్శకులు వస్తున్నారు.
చార్మినార్: నగరానికి తలమానికం వంటి చార్మినార్ వద్ద ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి స్థిరంగా (నెలవారీ 80వేల – 1.2 లక్షలు) ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/national-news/russian-president-putin-to-attend-brics-summit-in-india/
ఆధ్యాత్మికతకు పెద్దపీట : కేవలం వినోదమే కాకుండా, ఆధ్యాత్మిక పర్యాటకంలోనూ తెలంగాణ పురోగమిస్తోంది. హైదరాబాద్ వెలుపల ఉన్న యాదాద్రి, వేములవాడ, బాసర, కొండగట్టు వంటి క్షేత్రాలు రాష్ట్రంలో అత్యధిక సందర్శకులు వెళ్తున్న పది ప్రాంతాల్లో చోటు దక్కించుకోవడం విశేషం.
పర్యాటక రంగానికి కొత్త ఊపు : చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు మరియు ఆధునిక వినోద కేంద్రాల సమతుల్యత హైదరాబాద్ నగరాన్ని పర్యాటక రంగంలో బలంగా నిలబెడుతోంది. పెరుగుతున్న ఈ రద్దీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తోంది.

