Drones Seized: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శనివారం భారీ స్థాయిలో డ్రోన్ల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సింగపూర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 70 డ్రోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ డ్రోన్ల విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/jr-ntr-drastic-change-for-dragon-raises-fans-concerns/
నిందితులు సింగపూర్ నుంచి రెండు వేర్వేరు విమానాల్లో ఈ డ్రోన్లను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రోన్లను ఎందుకు తీసుకువచ్చారనే కోణంలో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లోనూ సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద 22 హై-ఎండ్ డ్రోన్లను సీజ్ చేశారు. మళ్లీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/woman-said-no-to-marriage-man-injected-aids-blood/
మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ తీవ్రత నేపథ్యంలో అక్కడి గగనతలాన్ని మూసివేశారు. ఈ ప్రభావం శంషాబాద్ ఎయిర్ పోర్టుపై తీవ్రంగా ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ అంతర్జాతీయ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం ఒక్కరోజే మొత్తం 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో.. విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు.

