Homeతెలంగాణహైదరాబాద్Gachibowli: గచ్చిబౌలిలో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం.. ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు

Gachibowli: గచ్చిబౌలిలో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం.. ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు

శేరిలింగంపల్లి (తెలుగుప్రభ): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ గచ్చిబౌలి, టీఎన్‌జీఓ కాలనీ, ఫేజ్–I ప్రాంతంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. భవన నిర్మాణ పనుల నిమిత్తం జరిపిన తవ్వకాల సమయంలో పైన ఉన్న మట్టి కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మట్టి కింద చిక్కుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచ గచ్చిబౌలి టీఎన్‌జీఓ కాలనీ ఫేజ్-Iలోని ప్లాట్ నెం. 612లో చుక్కపల్లి కృష్ణ కార్తిక్ అనే వ్యక్తి రెండు అంతస్తుల (జీ+2) భవన నిర్మాణానికి సంబంధిత అధికారుల నుండి అనుమతులు పొందారు. ఈ క్రమంలో గురువారం సుమారు 10 గంటల ప్రాంతంలో పునాది పిల్లర్ల కోసం సుమారు 9 అడుగుల లోతులో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్విన మట్టిని తొలగిస్తున్న సమయంలో పక్కనే ఉన్న మట్టి ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు మట్టి కింద పడిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డయల్-100, గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు మట్టిని తొలగించి బాధితులను బయటకు తీసి చికిత్స నిమిత్తం దగ్గరలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన రామ్ కరణ్ (24), అజేష్ (26)లకు స్వల్ప గాయాలు కాగా, ప్రాథమిక చికిత్స అనంతరం వారు డిశ్చార్జ్ అయ్యారు. మరో కార్మికుడు సురేష్ (34) ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. నిర్మాణ పనులు జరిపే సమయంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యులైన మేస్త్రీ, సైట్ సూపర్‌వైజర్, ప్లాట్ యజమానిపై తగిన చట్టపరమైన సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో తేలిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Also Read: Drainage : హయాత్‌నగర్‌లో ‘హఠాత్’ గండం.. కుంగిన ట్రంక్‌లైన్‌తో కుదేలవుతున్న జనం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News