Air Quality Index: దేశ రాజధాని దిల్లీ బాటలోనే హైదరాబాద్ పయనిస్తోంది. గత కొద్దిరోజులుగా భాగ్యనగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ(ఫిబ్రవరి 2) తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 318గా నమోదైంది. సాధారణంగా రెండంకెలకే పరిమితం కావాల్సిన ఈ సూచీ.. ఒక్కసారిగా పెరగడంతో జంటనగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కాలుష్యానికి ప్రధాన కారణాలివే: గాలిలో ఉండే తేమ, పొగమంచు కలిసి కాలుష్య కారకాలను భూమికి సమీపంలో ఉంచుతున్నాయి. దీనికి తోడు నగరంలో విపరీతంగా పెరిగిన వాహనాల రద్దీ వల్ల వెలువడే పొగ వాయుకాలుష్యానికి ప్రధానకారణం అవుతుంది. నిర్విరామంగా సాగుతున్న నిర్మాణ పనులు సైతం గాలిలో ధూళి కణాలు పెరగడానికి కారణం అవుతున్నాయి. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా చెత్తను తగులబెట్టడం కాలుష్యానికి కారణం అవుతుంది. అయితే గత 15 రోజులతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. సికింద్రాబాద్, సోమాజిగూడ వంటి రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆరోగ్యానికి హానిక స్థాయిలోనే ఉండటం గమనార్హం.
Also read-Head & Neck Cancer: యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హెడ్ & నెక్ ఆంకాలజీ సమ్మిట్..
వైద్యుల హెచ్చరిక: ముఖ్యంగా తెల్లవారుజామున 6 నుండి 7 గంటల సమయంలో వాయుకాలుష్య తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో నగర ప్రజలు, వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం కోరలు చాస్తున్న నేపథ్యంలో వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, సైనసైటిస్, అలర్జీ, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో బయట తిరగకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామాలు, వాకింగ్ వంటివి తగ్గించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో గాలి నాణ్యత మరింత పడిపోకముందే అధికారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

