సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి విద్యార్థి లోకం ఇప్పుడు రోడ్లెక్కింది. రాత్రింబవళ్లు శ్రమించి పరీక్షలు రాస్తే, లీకేజీల భూతం తమ జీవితాలను బుగ్గిపాలు చేస్తోందంటూ రగిలిపోతోంది. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (NTA) అసమర్థతపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ఆగ్రహజ్వాలలు ఇప్పుడు తెలంగాణ గల్లీలను కూడా తాకాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి లోకంపై దేశ రాజధాని ఢిల్లీలో విరుచుకుపడిన లాఠీచార్జీల వేడి, సికింద్రాబాద్ పరిధిలోని మల్లాపూర్‌లో అగ్గి రాజేసింది.
ఎన్‌టీఏ వైఫల్యాలపై దేశవ్యాప్త ఉద్యమం: మల్లాపూర్‌లో మిన్నంటిన నిరసనలు : జాతీయ పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ (NTA) వైఫల్యాలు, వరుస పేపర్ లీకేజీలు, వీటికి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల అమానుష లాఠీచార్జీని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఉప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మల్లాపూర్ ఎలిఫెంటా చౌరస్తా వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.
దిష్టిబొమ్మ దహనం – మార్మోగిన నినాదాలు : ప్రభుత్వాల అసమర్థత వల్లే లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలు నడిరోడ్డున పడ్డాయని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. మల్లాపూర్ ఎలిఫెంటా చౌరస్తా సాక్షిగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు, తమ హక్కుల సాధన కోసం నినదించారు.
నిజమైన దేశభక్తి అంటే ఏమిటి? : ఈ నిరసన ప్రదర్శనలో ఏఐఎస్ఎఫ్ ఉప్పల్ మండల అధ్యక్షుడు అజీమ్ పాషా, కార్యదర్శి మహేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. దేశభక్తి పేరిట విద్యార్థులను, యువతను భావోద్వేగాలతో మభ్యపెట్టడం కాదని, వారికి నాణ్యమైన విద్య, అత్యంత పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ, పారదర్శక ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నిజమైన దేశభక్తి అని వారు స్పష్టం చేశారు. 2014 నుంచి దేశంలో జాతీయ స్థాయి విద్యా పరీక్షల్లో వరుసగా పేపర్ లీకేజీలు, అవకతవకలు చోటుచేసుకోవడం కేంద్ర ప్రభుత్వ పాలకుల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజాస్వామ్య విలువల అణచివేత : ఎన్‌టీఏ సంస్థ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం బాధ్యత వహించకపోవడం అత్యంత విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాలను ప్రయోగించడం, ఇనుప బ్యారికేడ్లతో అడ్డుకోవడం, దారుణంగా లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలిపెట్టు అని నిప్పులు చెరిగారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ : ఈ మొత్తం దేశవ్యాప్త పరీక్షల నిర్వహణ వైఫల్యాలకు, విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ప్రశాంత్, సాయి, అనిల్, రాహుల్, అరవింద్, ఇర్ఫాన్, సల్మాన్, బన్నీ, షాబాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన విజయవంతం చేశారు.

