హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగు ప్రభ): గాంధీ ఆసుపత్రిలో ఔషధాల కొనుగోళ్ళలో జరిగిన అవినీతి ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. స్థానిక కొనుగోళ్ల పేరుతో రూ.7 కోట్ల విలువైన ఔషధాలకు రూ.13 కోట్ల బిల్లులు పెట్టినట్లు వెలుగులోకి వస్తున్న ఆరోపణలు అత్యంత దిగ్భ్రాంతికరమని ఏఐవైఎఫ్ పేర్కొంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులను కొందరు అవినీతి అధికారుల అడ్డాగా మార్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఈ ఆరోపణలు నిజమైతే ఇది ప్రజాధనాన్ని దోచుకునే సంఘటనే కాకుండా పేదల ప్రాణాలతో చెలగాటమాడిన నేరమని, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోందన్నారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర. మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రూపాయి ప్రజలు చెల్లించే పన్నుల సొమ్ము అని అన్నారు. ఆ నిధులను పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. కానీ అదే నిధులను కొందరు అవినీతి అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకుంటే అది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదని, భారత రాజ్యాంగం కల్పించిన ప్రజల ఆరోగ్య హక్కుపై జరిగిన ప్రత్యక్ష దాడి అని వారు దుయ్యాబట్టారు. ఒకవైపు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవని చెప్పి రోగులను బయట మెడికల్ షాపులకు పంపుతుంటే, మరోవైపు కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం అత్యంత సిగ్గుచేటు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల కొనుగోళ్లు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పారదర్శక ఈ-టెండర్ విధానంలో జరగాలన్నారు.
Also Read: Sridhar Babu: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు హామీ
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిమిత స్థాయిలో స్థానిక కొనుగోళ్ళకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే ప్రతి కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు, బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ, ఆడిట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరలకు కొనుగోళ్లు, తప్పుడు బిల్లులు, నాసిరకం మందుల సరఫరా లేదా అవసరం లేని మందులను కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో గత ఐదేళ్లుగా జరిగిన ఔషధాల కొనుగోళ్లు, స్థానిక కొనుగోళ్లు, స్టాక్ నిర్వహణ, గడువు ముగిసిన మందుల నిర్వహణపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి నివేదికను బహిరంగంగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న ప్రతి రూపాయిని బాధ్యుల నుంచే రికవరీ చేయాలన్నారు. పేదల ప్రాణాలు కొందరు అవినీతిపరుల సంపాదనకు బలికావడానికి ఏఐవైఎఫ్ ఎన్నటికీ అంగీకరించదన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించి తీవ్ర ప్రజా ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు.
Also Read: HMDA Ground: కులవృత్తుల మేళా ప్రారంభం.. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో 60 స్టాళ్ళు ఏర్పాటు

