Homeతెలంగాణహైదరాబాద్Heritage : హరిబౌళిలో భక్తి తరంగం... అక్కన్న మాదన్న ఆలయంలో బోనాల వైభవం!

Heritage : హరిబౌళిలో భక్తి తరంగం… అక్కన్న మాదన్న ఆలయంలో బోనాల వైభవం!

చార్మినార్,(తెలుగు ప్రభ) : గోల్కొండ చివరి నవాబు అబుల్ హసన్ తానీషా వద్ద ప్రధాన మంత్రిగా, సైన్యాధ్యక్షులుగా పనిచేసిన అక్కన్నమాదన్న సోదరులు పూజలు నిర్వహించిన పవిత్ర క్షేత్రం హరిబౌళి శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి మందిరంగా సుప్రసిద్దమయ్యింది. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా అస్వస్థతకు గురికాగా విశ్రాంతి కోసం ఓ ఉద్యనవనాన్ని ఎంపిక చేసుకున్నారు. నేటి తలాబ్ కట్ట శివారులోని సుల్తాన్ షాహి అప్పట్లో ఉద్యానవనమని చరిత్ర చెబుతుంది. రంగురంగుల పుష్పాలు రకరకాల మొక్కలతో విస్తరించిన ఉద్యానవనంలో నవాబు విశ్రాంతి కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. కొంత కాలం నవాబు ఇక్కడే నివసించారు.

- Advertisement -

నవాబు వద్ద సైనికాధ్యక్షుడు, ప్రధాన మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన అక్కన్నమాదన్నలు సైతం పరిపాలన సౌలభ్యం కోసం నవాబు విశ్రాంతి గృహానికి సమీపంలోని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలంలో తలాబ్ చెరువు నీటికి సమీపంలో ఉన్న ఎత్తైన ప్రాంతంలో అక్కన్నమాదన్నలు ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. నవాబుతానీషా నివాసముండడం వలన దానికి సుల్తాన్ షాహిగా పేరొందింది. అక్కన్నమాదన్నలు పూజా మందిరం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే బావి పరిసరాలు హరితవనం విస్తరించడంతో ఈ ప్రాంతం హరిబౌళిగా ప్రసిద్ది పొందింది. ఇక్కడి పుష్పాలతో అక్కన్నమాదన్నలు అమ్మవారికి ప్రతిరోజు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించేవారు
కాల క్రమంలో గోల్కొండ రాజ్యం మొఘల్ రాజుల వంశం కావడంతో అక్కన్నమాదన్నలు పూజలు నిర్వహించిన మహంకాళి మందిరం ఆలనాపాలనా కరువయ్యింది.

ఈ నిర్మాణాలలో అక్కన్నమాదన్నలు పూజలు జరిపిన మహంకాళి మందిరం అతర్భాగంలో కలిసి పోయింది. నిజాం పాలన చివరి రోజుల్లో ఆర్య సమాజం ప్రతినిధులు కొందరు చారిత్రాత్మక ఆధారాలతో 1948లో ఈ ప్రాంతంలోని పురాతన శిథిల ప్యాలేస్ గోడను తొవ్వారు. అక్కడ అక్కన్నమాదన్నలు పూజలు చేసిన అమ్మవారి ప్రతిమతో పాటు ఇతర పూజా సామాగ్రి వెలువడ్డాయి. దీంతో ఆర్యసమాజ్ ప్రతినిధులు, స్థానికులతో కలిసి అదే ప్రాంతంలో ఆలయ పున:నిర్మాణం చేపట్టారు. అప్పటికీ ఈ స్థలం మీర్ మహ్మద్ అన్వర్ ఆలీఖాజా స్వాధీనంలో ఉండడంతో స్థానిక ప్రతినిధులు నిధులను సమకూర్చి స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయాన్ని పునరుద్దరించారు. 

ఆగస్టు 9,10 తేదీలలో బోనాలు, అమ్మవారి ఘటాల ఊరేగింపు : పాతబస్తీ హరిబౌలి చారిత్రాత్మక శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయం 78 బోనాల వార్షికోత్సవ వేడుకలు జూలై 31వ తేదీన ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు డి. ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 9వ  తేదీన మహాభిషేకం, అమ్మవారికి బోనాల సమర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం, 10  వ తేదీన బోనాల జాతర ఘటాల ఊరేగింపు, పోతరాజు స్వాగతం, రంగం భవిష్యవాణి, ఏనుగు అంభారిపై మాతేశ్వరి ఘటం ఊరేగింపు కొనసాగుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యంగా కలుగకుండా భారీ సన్నహాలు చేస్తున్నామన్నారు. 

77 సంవత్సరాల బోనాల జాతరను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్ : 1948 నుంచి ప్రతి ఆషాడమాసంలో బోనాల ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధి, బీజేపీ నాయకులు ఎల్ కె అద్వానీ, దివంగత మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగల్రావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని కె.దత్తాత్రేయ పేర్కొన్నారు. 

1948 నుంచి బోనాల ఉత్సవాలనునిర్వహిస్తున్నాం : 77  సంవత్సరాల బోనాల జాతరను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రతి సంవత్సరం ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేస్తామని ఆలయ కమిటీ కార్యదర్శి ఎ.సతీష్ కుమార్ తెలిపారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 77 సంవత్సరాల ఫొటోలను ఎగ్జిబిషన్ లో తిలకించవచ్చన్నారు. ప్రతి ఆషాడ మాసంలో ఐదు శుక్రవారాలు అమ్మవారికి వందలాది మంది మాతృమూర్తులచే సామూహిక కుంకుమార్చన చేపడతున్నామన్నారు. అనంతరం అమ్మవారి చీరెను ప్రసాదంగా మహిళా భక్తులకు పంపిణీ చేస్తామని సతీష్ కుమార్ పేర్కొన్నారు. 

ఆనవాయితీగా వస్తున్న ఏనుగు అంభారీపై శ్రీ మాతేశ్వరి ఘటం ఊరేగింపు : బోనాల సమర్పణ మరుసటి రోజు అక్కన్నమాదన్న మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఏనుగుపై ఊరేగించడం సంప్రదాయంగా వస్తుందని కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.పి క్రాంతి కుమార్ తెలిపారు. కర్ణాటక నుంచి లక్ష్మిఅనే ఏనుగును నిర్వాహకులు ఆలయం వద్దకు తీసుకువచ్చి అంబారిగా అలంకరించి అమ్మవారి ఘటాన్ని ప్రతిష్ఠించి హరిబౌళి అక్కన్నమాదన్న మందిరం నుంచి మేళ తాళాలు మంగళవాయిద్యాలతో ఊరేగిస్తారు.

ఈ నెల 10వ తేదీన హరిబౌళి అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి మందిరం నుంచి ప్రారంభమయ్యే ఏనుగు అంభారి ఊరేగింపు బేలా, సుధాథియేటర్ మీదుగా లాల్దర్వాజా మోడ్, శాలిబండా, చార్మినార్, పత్తర్ గట్టి నుంచి నయాపూల్ ఢిల్లీ దర్వాజా కు చేరుకుంటుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News