Yashoda Hospitals Ambulance Servuce: యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ ఆధ్వర్యంలో ఓ వినూత్న అత్యాధునిక వ్యవస్థ ఈ రోజు శ్రీకారం చుట్టుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన “సెంట్రల్ అంబులెన్స్ కమాండ్ సెంటర్” అండ్ “స్పెషల్ కనెక్టెడ్ అంబులెన్స్ సర్వీసెస్”ను శనివారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్. ఎం. రమేష్, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్. ఎ. లింగయ్య, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్. వెంకట్ రమణ్ కోలా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
యశోద హాస్పిటల్స్ ప్రవేశపెట్టిన ఈ వినూత్న అత్యాధునిక వ్యవస్థ హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ ట్రామా కారిడార్లలో, అత్యవసర పరిస్థితుల సమయంలో కీలకమైన “గోల్డెన్ అవర్”లో సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు రూపొందించినట్లు ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు. ఈ అత్యాధునిక ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థలో ప్రపంచస్థాయి అంబులెన్స్ టెక్నాలజీ, కేంద్రీకృత కమాండ్ ఆపరేషన్స్, రియల్-టైమ్ టెలీ మానిటరింగ్, స్పెషలిస్ట్ గైడెడ్ ఇంటర్వెన్షన్స్, ట్రామా రెస్పాన్స్ వ్యవస్థలను ఒకే వేదికపై అత్యవసర వైద్య సేవలను వేగవంతంగా అందించడానికి సమన్వయం చేసినట్లు వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/telangana/tpcc-chief-mahesh-goud-on-sir-process/
యశోద హాస్పిటల్స్ ప్రారంభించిన ఈ సెంట్రల్ అంబులెన్స్ కమాండ్ సెంటర్.. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య స్పందన అందించి ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని సైబరాబాద్ సీపీ రమేష్ అన్నారు. కనెక్టెడ్ అంబులెన్స్ టెక్నాలజీ, రియల్‌టైమ్ మానిటరింగ్, ORR ట్రామా కారిడార్ సమన్వయం ద్వారా గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య స్పందన మరింత సమర్థవంతంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ స్పెషల్ కనెక్టెడ్ అంబులెన్స్ సర్వీసెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యశోద హాస్పిటల్స్ 8 ORR ట్రామా సెంటర్లలోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లతో స్వయంగా మాట్లాడారు. ప్రాణాలను రక్షించడంలో వారు అందిస్తున్న అంకితభావ సేవలను అభినందించారు. అదే నిబద్ధత, కరుణాభావం, అత్యవసర స్పందన స్ఫూర్తితో తమ సేవలను కొనసాగించాలని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లను కమిషనర్ ప్రోత్సహించారు.
‘అత్యవసర వైద్యం, ట్రామా సైన్సెస్, పేషెంట్ సేఫ్టీ, అత్యాధునిక ఆరోగ్య సేవల రంగాల్లో యశోద హాస్పిటల్స్ దేశంలోనే అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను వేగం, ఖచ్చితత్వం, సాంకేతిక నైపుణ్యం, మానవీయతతో అందించాలనే తమ లక్ష్యాన్ని యశోద హాస్పిటల్స్ మరోసారి చాటిచెప్పింది.’ – సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఈ సందర్భంగా డాక్టర్.ఎ. లింగయ్య మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సెకను ఎంతో విలువైనది. ఆ ప్రతి సెకనునూ సమర్థవంతంగా వినియోగించి రోగులకు వేగవంతమైన, ఖచ్చితమైన, ప్రాణరక్షక వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. 24/7 అత్యవసర హెల్ప్‌లైన్ 105910తో అనుసంధానమైన ఈ కమాండ్ సెంటర్‌ను అత్యంత వేగవంతమైన వైద్య స్పందన వ్యవస్థగా రూపొందించామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం కొన్ని సెకన్లలోనే స్పందించి, ఆస్పత్రి స్థాయి అత్యవసర వైద్య సేవలను రోగి వద్దకే, అంబులెన్స్ ప్రయాణ సమయంలోనే అందించే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశామని వివరించారు.
‘ఈ కనెక్టెడ్ అంబులెన్సుల్లో అత్యాధునిక రియల్‌టైమ్ టెలీ-మానిటరింగ్, టెలీ-మెడిసిన్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు రోగుల ఆరోగ్య పరిస్థితిని దూరం నుంచే పరిశీలిస్తూ, ప్రయాణ సమయంలో పారామెడికల్ సిబ్బందికి తక్షణ సూచనలు అందించగలరు. అంతేకాకుండా, క్యాథ్ ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్స్, స్ట్రోక్ టీమ్స్, ట్రామా టీమ్స్, ఐసీయూ బెడ్స్, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ వంటి కీలక వైద్య సదుపాయాలను రోగి ఆసుపత్రికి చేరుకునే ముందుగానే సిద్ధం చేసే అవకాశం ఈ అత్యాధునిక వైద్య వ్యవస్థ ద్వారా కలుగుతుంది. ORR ట్రామా కారిడార్ల సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సమన్వయం, తక్షణ ట్రామా స్పందన అందించడం ద్వారా రోగుల ప్రాణాలను రక్షించే అవకాశాలను మరింత మెరుగుపరచడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.’- డాక్టర్. ఎ. లింగయ్య

