Young Man Climbed Radio Tower: హైదరాబాద్‌లో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి చింతలకుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ వ్యక్తి రేడియో టవర్ ఎక్కి హల్ చేశాడు. పూర్తిగా పైవరకు ఎక్కడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఈ ఘటనతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చింతలకుంట సమీపంలో శనివారం ఓ యువకుడు రేడియో టవర్ ఎక్కి కలకలం సృష్టించాడు. ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ ప్రేమించిన వాళ్ల కోసమో లేదంటే తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయం జరగడం కోసమో కొందరు టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడటం కోసం రేడియో టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు.
సదరు యువకుడిని ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన జాన్ బాబుగా గుర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడితేనే కిందకు దిగుతానని అతను డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతూ అతడిని క్షేమంగా కిందకు దింపారు.
Also Read: https://teluguprabha.net/telangana/brs-mla-padi-kaushik-reddy-comments-after-cid-interrogation/
ఈ క్రమంలో టవర్ ఎందుకు ఎక్కావని మీడియా అతడిని ప్రశ్నించగా.. సీఎం రేవంత్‌తో మాట్లాడేందుకే ఎక్కానని తెలిపాడు. అయితే ఆయనతో ఏం మాట్లాడాలని అడిగితే అతను సరైన సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. టవర్ ఎక్కిన యువకుడిని చూసేందుకు స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పరిస్థితి సద్దుమణగడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

