Homeతెలంగాణహైదరాబాద్BJP: స్వామీజీల వేషధారణతో రాజకీయ స్కిట్లు.. హిందూ సమాజంపై దాడి- బాలస్వామి

BJP: స్వామీజీల వేషధారణతో రాజకీయ స్కిట్లు.. హిందూ సమాజంపై దాడి- బాలస్వామి

హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగుప్రభ): స్వామీజీల వేషధారణతో రాజకీయ స్కిట్లు చేయడమంటే హిందూ సమాజంపై దాడి కిందే లెక్క అని వీహెచ్‌పీ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఎంపీలు హిందుత్వాన్ని కించపరచడం స్వామీజీలను అవమానించడం అత్యంత దారుణమని ఆయన ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడారు. 

- Advertisement -

దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌ను రాజకీయ నాటకాలకు వేదికగా మార్చడం దారుణమని బాలస్వామి ఆరోపించారు. హిందూ సన్యాస సంప్రదాయానికి ప్రతీకలైన స్వామీజీల వేషధారణను రాజకీయ వ్యంగ్యానికి ఉపయోగించడం యావత్ హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. హిందూ ధర్మానికి, సాధు సంతులకు తగిన గౌరవం ఇవ్వకుండా వారి పవిత్ర వేషధారణను రాజకీయ నిరసనల కోసం వినియోగించడం అత్యంత అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు దేశంలోని కోట్లాది హిందువుల విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని ఆందోళన చెందారు. 

క్షమాపణ చెప్పాలి

ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ప్రజాప్రతినిధులు తమ చర్యపై ఆత్మపరిశీలన చేసుకుని, హిందూ సమాజానికి, సాధు సంతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలస్వామి డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు, ఆచార్యులు, సాధు సంతులు ఈ అంశంపై స్పందించి హిందూ సమాజ గౌరవాన్ని పరిరక్షించేలా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆయన కోరారు. హిందువుల విశ్వాసాలను అవమానించడమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. 

ఓటు బ్యాంకు రాజకీయాలు

అయోధ్యలో కుట్రపూరితంగా జరిగిన ఘటనపై ఇప్పటికే అక్కడ సిట్ అధికారులు దోషులను శిక్షిస్తున్నారని  తెలిపారు. అయినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న హిందూ వ్యతిరేక పార్టీలు హిందుత్వాన్ని కించపరిచే విధంగా పార్లమెంట్ ఆవరణలో స్వామీజీల వేషాదరణతో స్కిట్ నిర్వహించడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో లౌకిక విలువలు పాటించకుండా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలకు హిందూ సమాజం బుద్ధి చెబుతుందని బాలస్వామి  హెచ్చరించారు. అన్ని మతాలు, సంప్రదాయాల పట్ల సమాన గౌరవంతో వ్యవహరించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అన్నారు. కానీ పార్లమెంటు సాక్షిగా హిందూ సమాజానికి ప్రతీకలుగా ఉన్న స్వామీజీలను అవమానించడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని బాలస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News