చార్మినార్ (తెలుగు ప్రభ): ఎన్ని కాన్పులైనా మగపిల్లాడిని కనాలనే ఆశ తీరకపోవడంతో కన్న తల్లే పురిట్లో బిడ్డను అంగట్లో విక్రయానికి పెట్టింది. వరుసగా నలుగురు ఆడపిల్లలు.. ఐదో కాన్పులోనూ అమ్మాయే కావడంతో పోషించే స్తోమత లేక గుట్టుచప్పుడు కాకుండా అమ్మేందుకు సిద్ధమైంది. కానీ.. చివరకు బిడ్డ చేతులు మారే సమయంలో పోలీసులకు పట్టుబడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయించడానికి ఓ మహిళ యత్నించగా సోషల్ వర్కర్ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మంగళవారం మలక్ పేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమెకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయిదోసారి కూడా ఆడబిడ్డ పుట్టడంతో ఆ తల్లి ఆస్పత్రిలో తోటి పేషెంట్ల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.
డబ్బు ఆశ చూపించి
ఈ విషయం చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన వాహీదా ఖాతూన్ అనే మహిళకు తెలిసింది. ఆ వెంటనే వాహీదా ఖాతూన్ ఓ మధ్యవర్తి ద్వారా ఆ మహిళను కాంటాక్ట్ చేసింది. పుట్టిన బిడ్డను అప్పగిస్తే కొంత డబ్బు ఇస్తానని ఆశ పెట్టింది. దాంతో పసికందు తల్లిదండ్రులు బిడ్డను ఇవ్వటానికి ఒప్పుకొన్నారు.
ఈ క్రమంలో సంతానం కోసం మొక్కుకోవటానికి మెహ్రున్నిసా అనే మహిళ బార్కస్‌లోని పీలీ దర్గాకు రాగా వాహీదా ఖాతూన్ ఆమెతో మాటలు కలిపింది. అమ్మా అని అనిపించుకోవటానికి దర్గాకు వచ్చినట్టు మెహ్రున్నిసా చెప్పగా నీకు బిడ్డను ఇస్తా.. అయితే, రూ. 6 లక్షలు ఇవ్వాలని చెప్పింది. చివరకు రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకుంది. అనంతరం బిడ్డను షాహీన్ నగర్‌లో అప్పగిస్తానని చెప్పింది. ఆ తర్వాత చోటు మార్చి పహాడీషరీఫ్ పరిధిలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు రమ్మంది.
సోషల్ వర్కర్ చాకచక్యం
ఈ విషయం కాస్త ఎర్రకుంట జమాల్ బండ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త సఫియా మాహికి తెలిసింది. వెంటనే ఆమె సమాచారాన్ని బాలాపూర్ పోలీసులకు అందించింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు జేజేఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని వాహీదా ఖాతూన్‌ను అరెస్ట్ చేశారు. పసికందును రక్షించారు. చిన్నారి తల్లిదండ్రులను పిలిపించి వివరాలు సేకరించారు.
గతంలోనూ ఎన్నో విక్రయాలు
కాగా వాహీదా ఖాతూన్‌ను జరిపిన విచారణలో దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగు చూశాయి. ఇంతకు ముందు కూడా ఆమె కొందరు చిన్నారులను కూడా ఇలాగే అమ్మినట్టుగా వెల్లడైంది. దీనికోసం దర్గాల వద్దకు వెళుతూ అక్కడికి వచ్చే మహిళలతో వాహీదా ఖాతూన్ మాటలు కలిపేది. సంతానం కోసం వచ్చినట్టు ఎవరైనా చెబితే నీ కోరిక తీరేలా నేను చూస్తా అని చెప్పి లక్షల్లో బేరం కుదుర్చుకునేది. ఆ తర్వాత తన నెట్‌వర్క్‌లో ఉన్నవారిని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తూ బిడ్డ వద్దనుకునే వారి వివరాలు సేకరించి వారితో బేరం కుదుర్చుకునేది. పసికందును అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులో సగం తాను తీసుకుని మిగతా మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేది. విచారణలో వెలుగు చూసిన ఈ వివరాలతో పోలీసులు ఇప్పటి వరకు వహీదా ఖాతూన్ ఎవరెవరికి పసికందులను విక్రయించింది? అన్న కోణంలో బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

