Fire in Benz Car Kondapur: వేసవికాలంలో అగ్ని ప్రమాదాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన మరో ఉదాహరణగా నిలుస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం కారులో ఎల్పీజీ గ్యాస్ నింపుతుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించి కారు పూర్తిగా దగ్ధమైంది. మంటల ధాటికి పక్కనే ఉన్న మరో రెండు కార్లు, బైక్ కాలిపోయాయి. హైదరాబాద్ శివారులోనూ ఈ రోజు బెంజ్ కారు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది.
శనివారం సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో బెంజ్ కారు దగ్ధమైంది. కొండాపూర్ వాసిల్ల మెడోస్‌లో నివసించే మోయిస్(28) తన మెర్సిడెస్ బెంజ్ కారులో గచ్చిబౌలి నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. బొటానికల్ గార్డెన్ సమీపంలో కొత్తగూడ SLNT వద్దకు రాగానే కారు ఇంజిన్ నుంచి వచ్చిన పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన కారణంగా కొండాపూర్- గచ్చిబౌలి రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్తత, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి వాహనాలను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
మీ వాహనాన్ని నిర్ణీత సమయాల్లో సర్వీసింగ్ చేయించడం ముఖ్యం. ఎలక్ట్రికల్ వైరింగ్, బ్యాటరీ పనితీరు, ఇంధన పైపుల్లో లీకేజీలు ఉన్నాయేమో పరిశీలించాలి. సాధ్యమైనంత వరకు వాహనాన్ని నేరుగా ఎండ తగలకుండా నీడ ఉన్న ప్రదేశాల్లో లేదా కవర్ పార్కింగ్‌లో ఉంచాలి. దీనివల్ల క్యాబిన్ ఉష్ణోగ్రత, బ్యాటరీ వేడెక్కకుండా ఉంటుంది. కారు పార్క్ చేసినప్పుడు లోపల గాలి ప్రసరణ జరిగేలా కిటికీలను కొద్దిగా కిందకు దించాలి. ఇది కారు లోపల వేడి పేరుకుపోకుండా చేస్తుంది.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/car-hits-siblings-near-chintalakunta-one-dead/
కంపెనీ ఇచ్చిన వైరింగ్‌ను మార్చడం లేదా అదనపు లైట్లు, హారన్లు వంటివి ఏర్పాటు చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు ఎక్కువ. హై-క్వాలిటీ కాంపోనెంట్స్ మాత్రమే ఉపయోగించాలి. కారులో లైటర్లు, గ్యాస్ సిలిండర్లు లేదా పర్ఫ్యూమ్ వంటి మండే స్వభావం గల వస్తువులను ఎండలో పార్క్ చేసినప్పుడు లోపల వదిలివేయకూడదు. ఎలక్ట్రిక్ వాహనం వినియోగించేవారు నేరుగా ఎండలో ఎక్కువ సేపు ఉంచకూడదు. ఎందుకంటే అధిక వేడి బ్యాటరీ ప్యాక్ ఉష్ణోగ్రతను పెంచి పనితీరును ప్రభావితం చేస్తుంది. వాహనంలో ఎప్పుడూ చిన్నపాటి అగ్నిమాపక యంత్రాన్ని అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. ప్రమాదం సంభవించినట్లు గమనిస్తే వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి, అందరూ బయటకు వచ్చేలా చూడాలి.

