ఉప్పల్(తెలుగుప్రభ): ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయవాడకు చెందిన ప్రముఖ నాట్య గురువు శ్రీ జ్యోసుల రామచంద్రమూర్తి శిష్య బృందం సమర్పించిన భరతనాట్య ప్రదర్శన కన్నులపండువగా సాగింది.
కార్యక్రమంలో భాగంగా కళాకారులు కోమలి, మౌనిక, లాస్య, జోషిత, లక్ష్మి కౌసల్య, భార్గవి, దీపికా లక్ష్మి, నక్షత్ర తదితరులు తమ లయబద్ధమైన అడుగులతో భరతనాట్య కళా ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. ప్రదర్శనలో తొలిగా ‘పుష్పాంజలి’తో ప్రారంభించి.. ‘గోకుల నిలయ’, ‘గరుడ గమన’, ‘గంధము పూయరుగా’, ‘పలుకే బంగారమాయెనా’, ‘చక్కని తల్లికి’, ‘కృష్ణ శబ్దం’, ‘అదిగో అల్లదిగో’, ‘నమశ్శివాయతే’, ‘కాళింగ నర్తన తిల్లాన’ తదితర నృత్య రూపకాలను అత్యంత మనోహరంగా ప్రదర్శించి ప్రేక్షకులను మైమరిపించారు. కళాకారుల భావ, రాగ, తాళాల సమ్మేళనం, హావభావాలు సభను మంత్రముగ్ధులను చేశాయి. ఈ నృత్య ప్రదర్శనకు వీక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.


