- ప్రధాన రహదారిపై రెండు నెలలుగా పారుతున్న మురుగునీరు
- బోనం ఎత్తుకుని మురుగులో నడవాలా? అంటూ మహిళల ఆవేదన
- పండుగ ముందే శాశ్వత పరిష్కారం కోరుతున్న కాలనీవాసులు
- ఆలయాలకు రంగులద్దుతున్నారు… కానీ భక్తుల బాటలోని మురుగును తొలగించలేకపోతున్నారు
- అమ్మవారి దర్శనానికి… మురుగునీటిలో ప్రయాణమా?
- హిమగిరి నగర్, ఫీల్ గుడ్ హోమ్స్ కూడలిలో రెండు నెలలుగా పారుతున్న మురుగునీరు
- పట్టించుకోని అధికారులు అంటూ స్థానికుల ఆగ్రహం
గండిపేట్ (తెలుగు ప్రభ): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా భావించే బోనాల మహోత్సవాలు సమీపిస్తున్న వేళ రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని హిమగిరి నగర్ కాలనీ ఫీల్ గుడ్ హోమ్స్ ప్రధాన కూడలి పారిశుద్ధ్య సమస్యతో అధ్వాన్నంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా రహదారిపై మురుగునీరు నిరంతరం ప్రవహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపిస్తున్నారు. బోనాల సందర్భంగా వందలాది మంది మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఆలయాలకు వెళ్లే ప్రధాన మార్గంలోనే మురుగునీరు నిల్వ ఉండటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. భక్తి మార్గంలో పూలు పరచాల్సిన చోట మురుగునీరు పారుతుంటే… ఇలాంటి పరిస్థితుల్లో అమ్మవారికి బోనం సమర్పించాలా? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించలేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. పండుగ ఏర్పాట్లలో భాగంగా ఆలయాల అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు, ఇతర ఏర్పాట్లకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమే అయినప్పటికీ, ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, భక్తుల రాకపోకలకు సంబంధించిన మౌలిక సమస్యలను విస్మరించడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. మురుగునీటి కారణంగా దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద కూడా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. పండుగ రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరగనున్న నేపథ్యంలో వ్యాధుల వ్యాప్తి ప్రమాదం కూడా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బోనాల ఉత్సవాలకు ముందు యుద్ధప్రాతిపదికన మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, భక్తులు ఇబ్బందులు లేకుండా ఆలయాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు జీహెచ్‌ఎంసీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యం, పారిశుద్ధ్యాన్ని విస్మరించకుండా అధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు.
Also Read: Amazon Freedom Sale: వచ్చేస్తోంది అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. ఈ భారీ ఆఫర్లపై ఓలుక్కేయండి

