Homeతెలంగాణహైదరాబాద్Old City Bonalu: భక్తుల పాలిట కొంగు బంగారం పాత బస్తీ చారిత్రాత్మక ఆలయాలు.. అమ్మవార్ల...

Old City Bonalu: భక్తుల పాలిట కొంగు బంగారం పాత బస్తీ చారిత్రాత్మక ఆలయాలు.. అమ్మవార్ల విశిష్టత ఇదే

చార్మినార్ (తెలుగు ప్రభ): గోల్కొండ, లష్కర్ ఉత్సవాలను మరిపించే రీతిలో పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి బోనాలు ప్రతియేటా ఎంతో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ నెల 9,10 తేదీల్లో జరగనున్న బోనాల జాతరకు పాత బస్తీ చారిత్రాత్మక అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇక్కడ వెలిసిన ఒక్కో అమ్మవారి దేవాలయాలకు ఘన చరిత్ర ఉంది.

- Advertisement -

లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం

భక్తుల కొంగుబంగారంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం విరాజిల్లుతుంది. 1908లో ముంచెత్తిన మూసీ వరదల్లో హైదరాబాద్ నగరం అతలాకుతలంగా మారింది. అప్పటి ప్రధాని మహరాజ్ కిషన్ ప్రసాద్ సూచనల మేరకు నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ స్వయంగా మాతా మహంకాళికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వరదలు తగ్గినట్లు స్థానికులు చెబుతారు. 

చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం

కొన్ని వందల సంవత్సరాల క్రితం గోల్కొండను పాలించిన నిజాం నవాబుల పాలనలో ప్రస్తుతమున్న చార్మినార్ పరిసర ప్రాంతాన్ని భాగ్యవతి పురం అని పిలిచేవారు. ఖులీకుతుబ్షా 1591లో చారిత్రాత్మక చార్మినార్‌ను నిర్మించారు. భారీ కట్టడాలను, కోట ప్రహరీలను నిర్మించే సమయంలో ముందుగా అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి, ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలోనే చార్మినార్‌కు తూర్పు దిక్కున ఆగ్నేయ మూలలోని మినార్ అడుగుభాగంలో శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని నిర్మించారు.

శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయం

గోల్కొండ చివరి నవాబు అబుల్హాసన్ తనీషా వద్ద ప్రధాన మంత్రి, సైన్యాధ్యక్షులుగా పనిచేసిన అక్కన్నమాదన్న సోదరులు పూజలు నిర్వహించిన పవిత్ర క్షేత్రం అక్కన్నమాదన్న మహంకాళి మందిరంగా సుప్రసిద్దమయింది. 

సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయం

400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయం సుల్తాన్షాహి శ్రీ జగదాంబ దేవాలయం. వింత వ్యాధుల భారినుంచి రక్షించే చల్లని తల్లి శీత్లామాతగా సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయం విరాజిల్లుతుంది. పూర్వం అంటురోగాలతో ఎంతో మంది మృత్యువాత పడుతున్న తరుణంలో వందేళ్ళ క్రితం అప్పటి ప్రధాన మంత్రిగా ఉన్న కిషన్ ప్రసాద్ కుటుంబం సుల్తాన్ షాహిలో శీత్లామాతా దేవాలయాన్ని నిర్మించారు. 

మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం 

నిజాం పాలనలో హైదరాబాద్ నగర ప్రజలకు కూరగాయలు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా అప్పటి నవాబు కూరగాయల మీరాలం మండిని ఏర్పాటు చేశారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని 1902లో ఒక రావి మొక్కను నాటి, పక్కనే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాల క్రమేణా మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయంగా ప్రసిద్ది చెందింది. 

ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం

సుమారు 500 మంది జనాభాతో ఉన్న ఉప్పుగూడ ఆనాడు పటేల్ పట్వారి పాలనలో ఉండేది. అంటువ్యాధులు ప్రబలుతున్న నేపధ్యంలో వందేళ్ళ క్రితం ఉప్పుగూడ గ్రామానికి ప్రధాన ద్వారం చుట్టూ పచ్చటి పంటపొలాల నడుమ స్థానికులు ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయాన్ని నిర్మించారు.

old city bonalu history 

హరిబౌళి శ్రీ బంగారుమైసమ్మ దేవాలయం

వందల ఏళ్ళ క్రితం నాటి హరిబౌళి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో నిజాం పరిపాలనలో ప్రధాన మంత్రిగా పనిచేసిన కిషన్ ప్రసాద్ దేవిడి ఉంది. కోట రక్షణ గోడకు ఎడమవైపున అమ్మవారి దేవాలయం ఉంటే భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశ్యంతో బంగారు మైసమ్మ దేవాలయాన్ని నిర్మించారు. 

గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి దేవాలయం

నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ నగర రక్షణార్థం చుట్టూ నిర్మించిన ప్రహరీకి 13ద్వారాలు ఉండేవి. వాటిలో చారిత్రాత్మక గౌలిపురా దేవాలయం ఒకటి. వందల ఏళ్ళ క్రితం గౌలిపురా గ్రామంలో వెలిసిన శ్రీ మహంకాళి మాతేశ్వరి దేవాలయం గ్రామ దేవతగా విరాజిల్లుతుంది. 

చందూలాల్ బేలా శ్రీ ముత్యాలమ్మ దేవాలయం

వందల ఏళ్ళ క్రితం చందూలాల్ బేళా పరిసర ప్రాంతాలలో స్థానికులు ముత్యాలమ్మ దేవాలయాన్ని నిర్మించారు. అంటు వ్యాధులు సోకిన వారు అమ్మవారిని పూజిస్తే వ్యాధులు నయమయ్యాయని పూర్వీకులు చెబుతారు. అప్పటి నుంచి ఆలయం ప్రసిద్ధి చెందింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News