- రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిని ఈఎస్ఐసీ అధీనంలోకి తీసుకోవాలి
- 100 పడకల నుంచి 200 పడకలకు విస్తరించాలి
- పటాన్ చెరులో సబ్ రీజినల్ ఆఫీస్ ఏర్పాటుకు విజ్ఞప్తి
- సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు చొరవ
- ఢిల్లీలో ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్‌తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ
పటాన్‌చెరు (తెలుగు ప్రభ): ఫ్యాక్టరీల్లో రెక్కలు ముక్కలు చేసుకునే నిరుపేద కార్మికులకు జబ్బు చేస్తే.. మైళ్ల దూరం పరిగెత్తాల్సిన పనిలేకుండా, స్థానికంగానే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అడుగు వేశారు. పటాన్‌చెరు, ఇస్నాపూర్ ప్రాంతాల్లోని లక్షలాది మంది కార్మికుల ఆరోగ్య కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు పడింది. మంగళవారం న్యూఢిల్లీలోని ఈఏస్ఐ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్‌తో ఎంపీ రఘునందన్ రావు సమావేశమయ్యారు. మెదక్ పార్లమెంట్ ప్రాంతంలో కార్మికులు పడుతున్న అవస్థలను వివరించి, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా కార్బుల సమస్యలను డీజీ దృష్టికి తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతం పటాన్‌చెరు, బొల్లారం, సదాశివపేట పారిశ్రామిక ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా కార్మికులు ఉంటే, వారి కుటుంబాలతో కలిపి ఎనిమిది లక్షల మంది నివసిస్తున్నారు. వీరికి స్థానికంగా రామచంద్రాపురంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నప్పటికీ, అక్కడ పూర్తిస్థాయి డాక్టర్లు, ఆధునిక యంత్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ఆపరేషన్ కావాలన్నా, అత్యవసర వైద్యం కావాలన్నా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాత్‌నగర్ ఆసుపత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది.
నగరం దాటుకుని, ట్రాఫిక్‌లో ఆసుపత్రికి వెళ్లేసరికి సమయం వృథా కావడంతో కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రామచంద్రాపురం ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఈఎస్ఐ కార్పొరేషన్ తన సొంత పరిధిలోకి తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిని కేంద్ర పరిధిలోకి తీసుకుంటే సరికొత్త భవనాలు, పెద్ద డాక్టర్లు, డయాలసిస్ సేవలు, 200 పడకలతో పెద్ద ఆసుపత్రిగా మారుతుందని, కార్మికులకు స్థానికంగా ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుందని వివరించారు. తెలంగాణ మొత్తానికి ఒక్కటే పెద్ద ఈఎస్ఐ ఆసుపత్రి సనత్‌నగర్‌లో ఉండటంతో అక్కడ నిరంతరం రోగుల రద్దీ ఉంటోందన్నారు. చిన్న ఆపరేషన్‌కు కూడా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురం ఆసుపత్రిని పెద్ద ఆసుపత్రిగా మారిస్తే సనత్‌నగర్‌పై సగం భారం తగ్గుతుందని, రెండు చోట్లా వేగంగా వైద్యం అందుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య సేవలతో పాటు కార్మికుల పింఛన్లు, క్లెయిమ్‌లు, ఐడీ కార్డులు, ఫ్యాక్టరీ యజమానుల ఈఎస్ఐ ఆఫీసు పనుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని ఈ సమస్యను తీర్చడానికి పటాన్‌చెరులోనే సబ్ రీజినల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు.
Also read: MMC Commissioner: డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలు ముమ్మరం చేయాలి.. ఎంఎంసీ కమిషనర్
కేంద్రం సానుకూల స్పందన..
ఎంపీ వివరించిన సమస్యలపై ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పారిశ్రామిక ప్రాంత కార్మికులకు మేలు జరిగేలా రామచంద్రాపురం ఆసుపత్రి స్వాధీనం, పటాన్‌చెరులో కొత్త ఆఫీస్ ఏర్పాటు ప్రతిపాదనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం ఎంపీ రఘునందన్ రావు చేసిన కృషిపై పారిశ్రామిక ప్రాంత ప్రజలు, కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

