* ఘనంగా కరాటే బెల్ట్ పరీక్షలు
* ముఖ్య అతిథిగా ఉప్పల్ జోన్ అదనపు డీసీపీ ఎన్. వెంకటరమణ
* వంద మంది విద్యార్థుల పాల్గొనికతో విజయవంతమైన బెల్ట్ పరీక్షలు
ఉప్పల్ (తెలుగు ప్రభ): కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకన్ ఇండియా ఆధ్వర్యంలో గణేష్ మాస్టర్ నిర్వహణలో కరాటే బెల్ట్ పరీక్షలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉప్పల్ జోన్ అదనపు డీసీపీ ఎన్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై బెల్ట్ పరీక్షలను ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు వంద మంది కరాటే విద్యార్థులు, కరాటే మాస్టర్లు, శిక్షకులు ఈ బెల్ట్ పరీక్షల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. మాస్టర్ శివ శిక్షణలో క్రమశిక్షణతో సాధన చేస్తున్న నెమ్మది రిత్విక్ బెల్ట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బ్రౌన్ అండ్ బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ఎన్. వెంకటరమణ చేతుల మీదుగా రిత్విక్‌కు బ్రౌన్ అండ్ బ్లాక్ బెల్ట్‌తో పాటు ధ్రువపత్రాన్ని అందజేసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎన్. వెంకటరమణ మాట్లాడుతూ.. కరాటే విద్య విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. నిరంతర సాధన, పట్టుదల, క్రమశిక్షణతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. మాస్టర్ శివ మాట్లాడుతూ.. నెమ్మది రిత్విక్ సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కరాటే మాస్టర్లు, శిక్షకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Also Read: KTR: మాటలు కోటలు దాటుతున్నాయి.. పనులు గడప దాటడం లేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

