సికింద్రాబాద్ (తెలుగుప్రభ): హబ్సిగూడలోని ఓ పన్నీర్ విక్రయ కేంద్రం వద్ద తాము రిపోర్టర్లమంటూ తరచూ హంగామా సృష్టించి, సరఫరా వాహనాన్ని అడ్డుకున్నారని ఆరోపణల నేపథ్యంలో నలుగురిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8లోని శ్రీకృష్ణ మిల్క్ ప్రొడక్ట్స్ పన్నీర్ విక్రయ కేంద్రం నిర్వాహకురాలు బి. శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గత 15 రోజులుగా కొందరు వ్యక్తులు దుకాణం వద్దకు తరచూ వచ్చి, పన్నీర్ సరఫరా వాహనం వచ్చిన ప్పుడల్లా దానిని అడ్డుకుంటూ న్యూసెన్స్ సృష్టిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము రిపోర్టర్లమని చెప్పు కుంటూ, దుకాణంలో నకిలీ పన్నీర్ విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ, దుకాణంలోకి రాకుండానే బయట గొడవకు దిగుతున్నారని తెలిపారు. ఆగస్టు 4న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో జి.రామ కృష్ణ,గంగి కృష్ణ, బోడికే వాణి బాబాయి, సతీష్ అనే నలుగురు వ్యక్తులు పన్నీర్ డెలివరీ వాహనాన్ని వెళ్లనివ్వకుండా అడ్డంకులు సృష్టించారని ఆరో పించారు. అంతేకాకుండా, దుకాణం వద్ద వీడియోలు చిత్రీకరించి, నకిలీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు ప్రచారం చేస్తూ, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో వినియోగదారులు, పరిసర వ్యాపారుల్లో అపోహలు ఏర్పడి, భవన యజమానులు కూడా దుకాణాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 401/2026గా బీఎన్‌ఎస్ సెక్షన్లు 292, 351(2), 126(2) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఎస్సై పి. కరుణాకర్ దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: IAF : వైమానిక వీరుల విజయపథం.. ఓయూలో వాయుసేన వాహన విహారం!

