సికింద్రాబాద్ (తెలుగుప్రభ): నిరుద్యోగం,ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైల్వే పట్టాలపై పరిగెత్తుతూ ఆత్మహత్యకు యత్నించగా, చిలకలగూడ పోలీసులు సాహసోపేతంగా అతని ప్రాణాలను కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్.గోవింద్ (25) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్–సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డయల్–112కు రెండు అత్యవసర కాల్స్ అందాయి. వెంటనే బీసీ–1 పెట్రోలింగ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టింది. అలుగడ్డబావి రైల్వే సిగ్నల్ సమీపంలో గోవింద్‌ను గుర్తించిన పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా, అతను సీతాఫల్ మండి వైపు రైల్వే పట్టాల వెంట పరుగెత్తాడు. ఈ సమయంలో పోలీస్ కానిస్టేబుల్ పి. శంకర్ సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర కాలినడకన వెంబడించి, యువకుడిని అదుపులోకి తీసుకుని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు గోవింద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యం చెప్పి, అతడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సమయోచితంగా స్పందించిన చిలకలగూడ పోలీసుల చర్యతో ఒక నిండు ప్రాణం నిలిచింది. తమ కుమారుడి ప్రాణాలను కాపాడిన పోలీసులకు గోవింద్ తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని కొనియాడారు.
Also Read: Syros EV: ల్యాండ్‌మార్క్ కియాలో సరికొత్త సైరోస్ ఈవీ ఆవిష్కరణ
ఎవరైనా భావోద్వేగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసుల సహాయం కోరాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. సమయానికి అందే సహాయం ప్రాణాలను కాపాడగలదని తెలిపారు.

