చార్మినార్ (తెలుగు ప్రభ) : అఖిలభారత విద్యా పరిషత్ (ఏబీవీపీ) సిటీ కళాశాల శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో సిటీ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ భారీ ఊరేగింపు శాలిబండ మీదుగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి చేరుకుంది. బ్యాండ్ మేళాల హోరు, పోతరాజుల విన్యాసాలు, విద్యార్థినుల నృత్యాలతో శోభాయాత్ర మార్గమంతా పండుగ వాతావరణం నెలకొంది.
అమ్మవారికి 31 బోనాల సమర్పణ : దాదాపు మూడు వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. తలలపై బోనమెత్తుకుని, పసుపు కుంకుమలు, వేపాకులతో అలంకరించిన బోనాలతో విద్యార్థినులు భక్తిశ్రద్ధలతో ముందుకు కదిలారు. ఆలయానికి చేరుకున్న అనంతరం సింహవాహిని అమ్మవారికి 31 బోనాలను వైభవంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
14 ఏళ్ల నిరంతర సంప్రదాయం : సిటీ కళాశాల విద్యార్థులు లాల్ దర్వాజ అమ్మవారికి ఈ రీతిన బోనాలు సమర్పించడం ఇది కొత్తేమీ కాదు. గత 14 ఏళ్లుగా కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో విద్యార్థులు ఈ ఆనవాయితీని ప్రతి సంవత్సరం భక్తిభావంతో కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ భారీ వేడుకలో ఏబీవీపీ సిటీ కళాశాల అధ్యక్షుడు అనిల్ కుమార్‌తో పాటు సీనియర్ విద్యార్థులు కళ్యాణ్, దిలీప్, వాసు, నితిన్ రఘు, శేఖర్, అనిల్, అఖిల్, అక్షయ, జితేందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

