Mecca Accident: గతేడాది నవంబర్‌లో మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమైన విదితమే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం అందజేశారు. 44 మంది మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గాయపడినవారికి రూ. 3 లక్షల చొప్పున సాయం అందజేశారు.
‘ఈ ప్రభుత్వం మీది.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.. మీకు అండగా ఉంటాం” అని మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే మంత్రి అజహరుద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మదీనాకు పంపిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వారికి గుర్తు చేశారు. సహజంగా దేశం బయట జరిగే ప్రమాదాల్లో మృతిచెందిన వారికి ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని.. కానీ, ప్రజా ప్రభుత్వం మానవతా దృక్పథంతో సహాయం చేయాలని నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రమాదంలో 44 మంది మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కు ద్వారా ఆర్థిక సహాయం అందజేసినట్లు సీఎం రేవంత్ వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది నవంబర్ 17న యాత్రికులతో మక్కా నుంచి బయలుదేరిన బస్సును.. డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో బస్సులోనే 44 మంది సజీవదహనమయ్యారు.

