CM Revanth Reddy Arrive- Alive: వాహనదారులకు విధించే చలానాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘అరైవ్- అలైవ్’ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ మేరకు పోలీసులకు కీలక సూచనలు చేశారు.
వాహనంపై చలాన్‌పై పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ పోలీసులకు సూచించారు. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యజమాని వచ్చినప్పుడే బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని రిజిస్ట్రేషన్ నంబర్‌కి సింక్ చేయాలని అన్నారు. దీంతో చలాన్ పడిన వెంటనే సదరు వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవ్వాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/actor-vijay-cbi-questioning-karur-stampede-case/
‘రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో 3 శాతం మేర నష్టం జరుగుతోంది. ప్రతి నిమిషానికో రోడ్డు ప్రమాదం, ప్రతి 3 నిమిషాలకి ఓ ప్రాణం పోతోంది. రోడ్డు ప్రమాద నివారణకు పోలీసు శాఖ ప్రణాళిక చేపట్టింది. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పోలీసు శాఖ నిలుస్తోంది. సమాజంలో కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణాపాయంగా మారుతోంది. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి. వీటితో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి.’ అని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ వెల్లడించారు. డ్రగ్స్‌ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని.. వీటి నియంత్రణలో హైదరాబాద్ చురుగ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు. అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/national-news/former-vp-jagdeep-dhankhar-admitted-aiims-fainting/
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ‘అరైవ్- అలైవ్’ అనే ఉద్యమం నిర్వహిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పోలీసులు, రవాణా శాఖతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనవరి 13 నుంచి 24 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీజీపీ స్పష్టం చేశారు.

