CM Revanth Reddy Legislative Council: తెలంగాణ శాసన మండలి నూతన భవనాన్ని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో ఇకపై మండలి సమావేశాలు జరగనున్నాయి. రూ.30 కోట్లతో పాత భవనాన్ని ప్రభుత్వం ఆధునీకరించింది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒకే ప్రాంగణంలో ఉభయ సభలు ఉండేలా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అత్యాధునిక హంగులతో తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని చారిత్రక పాత అసెంబ్లీ భవనాన్ని ప్రభుత్వం ఆధునీకరించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఈ నూతన భవనమే శాసన మండలిగా సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

పాత అసెంబ్లీ భవనాన్ని నిజాం కాలం నాటి ఇండో-సార్సెనిక్ వాస్తుశైలిలో నిర్మించారు. ఈ భవనంలోనే గతంలో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ, ఆ తర్వాత ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత దీనిని ఏపీ అసెంబ్లీకి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ అమరావతికి తరలివెళ్లగా.. ఈ భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. మరోవైపు 2018 నుంచి ఇప్పటివరకు జూబ్లీహాల్‌లో మండలి సమావేశాలు జరిగేవి.
అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అసెంబ్లీ, కౌన్సిల్ రెండూ ఒకే ప్రాంగణంలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేశారు. ఈ మేరకు ఈ చారిత్రక భవనాన్ని పునరుద్ధరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ) సహకారంతో రూ. 30 కోట్లతో 18 నెలల పాటు ఈ పనులు జరిగాయి.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-assured-free-electric-scooters-to-girl-students/
ఆధునీకరించిన భవనంలో అధునాతన డ్రైనేజీ, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఫ్లోరింగ్ పనులు నిర్వహించారు. సీఎం, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కోసం ప్రత్యేక ఛాంబర్లు, మీడియా హాల్‌ను నిర్మించారు. కాగా, ఈ భవనం పార్లమెంట్ తరహాలో ఎంతో అద్భుతంగా ఉందని, సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పించామని మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. అదే విధంగా అలాగే ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం కొత్త సెంట్రల్ హాల్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

