Cockroach Janata Party: దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్ష పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల సెగ నేడు భాగ్యనగరానికి తాకనుంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో భారీ ధర్నాకు పిలుపునిచ్చారు.ఇందిరా పార్క్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వేదికగా ఉదయం 10:00 గంటల నుంచి ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కానుందని పార్టీ నిర్వాహకులు తెలిపారు.
కాక్రోచ్ ప్రధాన డిమాండ్లు ఇవే: దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పేపర్ లీకేజీలపై పూర్తిస్థాయి విచారణ జరిపి.. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యావ్యవస్థలో తక్షణ సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకతను తీసుకురావడంతో పాటు సమూల మార్పులు ప్రవేశపెట్టాలని పార్టీ నిర్వాహకులు తెలిపారు.
Also read-Earthquake: భద్రాద్రి జిల్లాలో భూకంపం.. భయాందోళనలో స్థానిక ప్రజలు!
ధర్నా చౌక్ వద్ద భారీ భద్రత: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టే ధర్నాకు పోలీసులు అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, నిరుద్యోగ యువత, పౌర సమాజ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే శాంతియుత మార్గంలో ఈ నిరసనను విజయవంతం చేయాలని యువతకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.

