Commercial Gas Black Marketing: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తలెత్తిన వాణిజ్య సిలిండర్ల కొరతను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెటింగ్ దందా చేస్తూ అధిక ధరకు ఎల్పీజీని విక్రయిస్తున్నారు. కాగా, హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు ఎంతోకాలంగా ఈ దందా చేస్తుండగా.. మరికొందరు యుద్ధ ప్రభావాన్ని సాకుగా చూపుతూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/international-news/spain-shuts-airspace-to-us-planes-linked-to-iran-war/
హైదరాబాద్‌లో ఈ దందాపై ఓ కన్నేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముఠా గుట్టు రట్టు చేశారు. శ్మశానవాటికను కేంద్రంగా చేసుకుని అక్రమంగా సిలిండర్లను డంప్ చేస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 వేల కమర్షియల్ సిలిండర్‌ను రూ. 6 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో భారీ ఎత్తున గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రట్టు చేశారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్‌తో సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు మహ్మద్ అమీర్.. శంషాబాద్‌లో ‘మెట్రో గ్యాస్ ఏజెన్సీ’ని నడుపుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 414 ఎల్‌పీజీ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 11 రవాణా వాహనాలను కూడా సీజ్ చేశారు.
Also Read: https://teluguprabha.net/health-fitness/fatigue-causes-and-solutions-7-hours-sleep-energy-tips/
బంజారాహిల్స్‌లోని నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక శ్మశాన వాటికలో ఈ సిలిండర్లను నిల్వ చేసి, అక్కడి నుంచే గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా నగరంలో గ్యాస్ కొరత ఉందంటూ కృత్రిమ కొరతను సృష్టించి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గృహ అవసరాల గ్యాస్, కమర్షియల్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లకు మూడు రెట్లు అధిక ధరకు విక్రయించి సామాన్యులపై అధిక భారం మోపుతున్నారు. అయితే ఈ ముఠా గత ఏడాదిన్నర కాలంగా ఈ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రఘునాథ్ వెల్లడించారు.

