CP Sajjanar Holi Guidelines: రేపు హోలీ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు సీపీ సజ్జనార్. బలవంతంగా రంగులు పూయడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని.. న్యూసెన్స్ చేసే వారిపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంచుతాయని పేర్కొన్నారు. రంజాన్ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా పోలీసులు సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ ప్రజలు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోలీ పండుగ నేపథ్యంలో నగరంలో పలు ఆంక్షలు విధించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/road-accident-in-eluru-three-young-men-died/
‘ఎవరికైనా ఇష్టం లేకపోతే, లేని వారిపై బలవంతంగా రంగులు చల్లడం, పాదచారులు, వాహనాలపై రంగులు లేదా రంగు నీళ్లు చల్లడం నిషేధం. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్నందున ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు చూడాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేయాలి. పీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవాలి. నగరవ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంచుతాయి.’ అని సీపీ సజ్జనార్ అన్నారు.
హోలీ పండుగను పర్యావరణానికి హాని కలగకుండా ప్రజలు జరుపుకోవాలని సీపీ సజ్జనార్ తెలిపారు. రసాయన రంగులకు బదులుగా సహజ రంగులు వాడాలని సూచించారు. వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ‘యువకులు రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తాం. హోలీ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయాలి.’ అని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

