గండిపేట్ (తెలుగు ప్రభ): పోలీసు ఉద్యోగం అంటే కేవలం విధుల నిర్వహణే కాదు.. చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు న్యాయం అందించే బాధ్యత. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించేందుకు ఇప్పటి నుంచే పటిష్ఠమైన పునాది వేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి ప్రొబేషనరీ డీఎస్పీలకు సూచించారు. ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో ప్రత్యేక ఇంటరాక్షన్ నిర్వహించి, పోలీసు వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, క్షేత్రస్థాయి విధులు, వృత్తిపరమైన నైపుణ్యాలపై దిశానిర్దేశం చేశారు. శిక్షణ అనంతరం చేపట్టే జిల్లా ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల పనితీరు, వాటి బాధ్యతలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ), సర్కిల్ ఇన్‌స్పెక్టర్, డివిజనల్ ఆఫీసర్ స్థాయుల్లో విధుల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమన్వయ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.
పోలీసు ఉద్యోగంలో సుదీర్ఘకాలం పాటు మారుతున్న సామాజిక పరిస్థితులు, నేరాల స్వరూపం, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న 35 ఏళ్ల పోలీసు సర్వీసును దృష్టిలో ఉంచుకుని నిరంతరం నేర్చుకుంటూ, చట్టాలపై పట్టు సాధిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ప్రాక్టికల్ పోలీసింగ్ అనుభవాలను ట్రైనీ అధికారులతో పంచుకున్న కమిషనర్.. విధుల నిర్వహణలో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకోవడం, సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారాలను కనుగొనడం వంటి అంశాలను వివరించారు. ప్రొబేషనరీ డీఎస్పీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ వేమా శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ వి. భాస్కర్, ట్రైనీ అధికారులు పాల్గొన్నారు.

