Serilingampally: పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా సైబరాబాద్(CMC) కమిషనర్ శ్రీజన గురువారం ఉదయం కొంపల్లిలో విస్తృతంగా పర్యటించారు. ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ ఆకస్మిక తనిఖీతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పర్యటనలో భాగంగా కమిషనర్ శ్రీజన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
దుకాణదారులకు హెచ్చరిక: కోంపల్లి పరిధిలోని దుకాణదారులు తమ ప్రాంగణంలో తప్పనిసరిగా చెత్త కుండీలను (Dustbins) ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. పారిశుధ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.
ఫాక్స్ సాగర్ చెరువు ప్రక్షాళన: ఫాక్స్ సాగర్ చెరువును పరిశీలించిన కమిషనర్.. అందులో పేరుకుపోయిన గుర్రపుడెక్కపై అసహనం వ్యక్తం చేశారు. రాబోయే 10 రోజుల్లోగా గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించి చెరువును శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జయభేరి కాలనీ సమస్యలకు పరిష్కారం: జయభేరి కాలనీలో నీరు నిలుస్తున్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్.. స్థానికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా రోడ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను గుర్తించిన కమిషనర్.. వాటి వల్ల ప్రజలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఎక్కడా కేబుళ్లు వేలాడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also read-Hyderabad: నోవోటెల్ హెచ్‌ఐసీసీలో ఫ్యాషన్ హంగామా.. ఏప్రిల్ 10 నుంచి హైలైఫ్ ఎగ్జిబిషన్!
పార్కుల అభివృద్ధిపై నివేదిక: స్థానిక పార్కులు మరియు ఖాళీ ప్రదేశాలను సందర్శించిన కమిషనర్ శ్రీజన.. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ఏయే సదుపాయాలు కావాలో వివరిస్తూ సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై మరియు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.



