సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వెక్టర్ జనిత వ్యాధులను సమర్థ వంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ అధికారులు సూచించారు. జాతీయ వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీవీబీడీసీ) ఆధ్వర్యంలో తార్నాకలోని ఎంఎంసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంఎంసీ అదనపు ఆరోగ్య కమిషనర్ సి.ఎన్. రఘు ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరి గింది. సమావేశంలో ఎన్‌సీవీ బీడీసీ రాష్ట్ర ప్రోగ్రామ్ అధికారి, అదనపు సంచాలకురాలు డాక్టర్ కె. పద్మజ మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా లార్వా నిర్మూలన, సోర్స్ రిడక్షన్, ఇంటింటి సర్వేలు, దోమల ఉత్పత్తి కేంద్రాల గుర్తింపు, నిరంతర పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు పట్టణ స్థానిక సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు నివారణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా నిర్మూలించడం, ప్రజల భాగస్వా మ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయడం ద్వారా కీటక జనిత వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేష్, హెల్త్ జాయింట్ కమిషనర్ మోహన్ రెడ్డి, ఎంఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణతో పాటు జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, సీనియర్ ప్రోగ్రామ్ అధికారులు, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, పట్టణ ఆరోగ్య యూనిట్ అధికారులు, ఎంటమాలజిస్టులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అధికారులు పాల్గొన్నారు.
Also Read: IICT-VSSC: స్వదేశీ పర్యావరణహిత సాంకేతికత అభివృద్ధికి ఐఐసీటీ–వీఎస్ఎస్సీ ఒప్పందం

