Singareni MD and Chairman: సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం ఉదయం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి భవన్‌లో ఆయనకు సంస్థ జనరల్ మేనేజర్ తాడబోయిన శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఛైర్మన్ కార్యాలయంలో బుద్ధ ప్రకాష్ బాధ్యతలను చేపట్టారు.
ఐఏఎస్ అధికారిగా పలు విభాగాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన డా. జ్యోతి బుద్ధ ప్రకాష్.. గురువారం సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ 2002 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. గతంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించిన ఆయన.. అంతకుముందు సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లోనూ వివిధ హోదాల్లో పని చేసి గుర్తింపు పొందారు.
Also Read: https://teluguprabha.net/telangana/ex-mlc-kavitha-comments-on-cm-revanth-reddy/
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గానూ, భద్రాచలం ఐటీడీఏ పీఓగానూ పనిచేసి ఆయా జిల్లాల అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ సింగరేణి సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఎల్. వి సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతం పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న.. నూతన ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు సింగరేణి సంస్థ పైన సంక్షిప్తంగా వివరాలు అందించారు.

