Homeతెలంగాణహైదరాబాద్Tarnaka BJP: తార్నాక బీజేపీలో ముదిరిన వర్గ పోరు.. రోడ్డుకెక్కిన అంతర్గత విభేదాలు..!

Tarnaka BJP: తార్నాక బీజేపీలో ముదిరిన వర్గ పోరు.. రోడ్డుకెక్కిన అంతర్గత విభేదాలు..!

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తార్నాక డివిజన్ భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరు తీవ్ర కలకలం రేపుతోంది. నిన్నటివరకు లోపాయకారీగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందుతూ ఇటీవల పార్టీలో చేరిన యువ నేత శ్రీరామ్ వెంకటేష్, స్థానిక పాత తరం నాయకుల మధ్య మొదలైన ఈ ‘వర్గ పోరు’ ఇప్పుడు డివిజన్ పరిధి దాటి రాష్ట్ర స్థాయి రచ్చగా మారింది. దాడులు, పోలీసు ఫిర్యాదులు, అర్ధరాత్రి ఫ్లెక్సీల తొలగింపులతో తార్నాక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

- Advertisement -

శ్రీరామ్ వెంకటేష్ దూకుడు.. పాత తరం అసంతృప్తి!

సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ వెంకటేష్ ఇటీవల అధికారికంగా బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ఆయన డివిజన్‌లో బలమైన పట్టు సాధించారు. కాలనీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై పలు కాలనీల సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ వార్తల్లో నిలిచారు. అయితే, ఇన్నాళ్లుగా ఇక్కడ ఉన్న పాత నాయకులు చేయలేకపోయిన పనులను, ఈయన కేవలం మూడు నెలల్లోనే చేసి చూపిస్తూ దూసుకుపోతుండటంతో స్థానిక పాత వర్గం నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తమ ఉనికికే ముప్పు తెస్తుందనే ఆందోళనతో పాత వర్గం ఆయనపై అంతర్గత యుద్ధానికి తెరలేపింది.

Also Read: Nemmadi Rithvik: ప్రతిభకు గుర్తింపు.. నెమ్మది రిత్విక్‌కు బ్రౌన్ అండ్ బ్లాక్ బెల్ట్

కారు ధ్వంసం.. రాత్రికి రాత్రే ఫ్లెక్సీల చించివేత..!

ఈ వర్గ పోరు ఎంతవరకు వెళ్లిందంటే, ఇటీవల శ్రీరామ్ వెంకటేష్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘర్షణ వాతావరణం ఇలా కొనసాగుతుండగానే.. తాజాగా శ్రీరామ్ వెంకటేష్ ఉచిత సేవలో భాగంగా తార్నాకలో ఒక భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్‌లకు స్వాగతం పలుకుతూ డివిజన్‌లోని పలు ప్రధాన కూడళ్లలో శ్రీరామ్ వెంకటేష్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను ఓ నాయకుడు ఈర్ష్యతో రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వాటన్నింటినీ సోమవారం ఉదయాన్నే పీకించేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు నాయకుడు మున్సి పల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. తన సోషల్‌ యాక్టివిటీస్‌ను దెబ్బతీసే క్రమంలోనే ప్రత్యర్థి వర్గం ఈ దారుణాలకు ఒడిగడుతోందని,ఫ్లెక్సీలు చింపేసి, తొలగిస్తున్నారని శ్రీరామ్ వెంకటేష్ బహిరంగంగానే ఆరోపించడం సంచలనం రేపింది.

అగ్రనేతల సొంత డివిజన్ లోనే ఈ దుస్థితా?

ఈ అంతర్గత పోరు ఇప్పుడు బీజేపీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే తార్నాక డివిజన్ సాధారణమైన డివిజన్‌ కాదు. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎన్.రామ చంద్ర రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి వంటి అగ్రనేతలు నివసిస్తున్న, ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ ఇది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఆహ్వానిస్తూ వేసిన ఫ్లెక్సీలను, అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మున్సిపల్ అధికారులతో తీయించడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఇంత చిన్న ఏరియాలో కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, నాయకులు ఇలా గ్రూపు రాజకీయాలతో రోడ్డుకెక్కడం కేడర్‌ను గందరగోళంలో పడేస్తోందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రా యపడుతున్నారు.

రామచంద్రరావు శుభం కార్డ్ పలుకుతారా?

ముందున్నవి అత్యంత ప్రతిష్టా త్మకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కావడంతో, తార్నాకలో జరుగుతున్న ఈ పరిణామాలు తలనొప్పిగా మారాయి. కొత్తగా వచ్చి ఉత్సాహంగా పని చేస్తూ,ప్రజల్లో ఆదరణ పొందుతున్న శ్రీరామ్ వెంకటేష్ లాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలా? లేక పాత సీనియర్ల అసంతృప్తిని చల్లార్చాలా? అనే మీమాంసలో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పుడు అందరి కళ్లూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావుపైనే ఉన్నాయి. తన సొంత డివిజన్‌లోని ఈ తీవ్ర వర్గ పోరులో ఆయన నేరుగా జోక్యం చేసుకుని గ్రూపు రాజకీయాలకు ‘శుభం కార్డ్’ పలుకుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News