Lulu Hypermarket Food Safety: ఇటీవల కాలంలో చిరుతిళ్లలో బొద్దింకలు, పురుగులు, బల్లులు రావడం తరచూ చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు హైపర్‌మార్కెట్‌లో విక్రయించిన మిక్చర్ ప్యాకెట్‌లో ఫ్రైడ్ బల్లి వచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఫిర్యాదుల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాల్‌లోని ఇన్‌హౌస్ కిచెన్, రిటైల్, మాంసం ప్రాసెసింగ్ విభాగాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విక్రయదారులు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/technology-news/moto-g37-smartphones-launched/
కిచెన్‌లో కీటకాల సంచారం
కిచెన్ పరిసరాల్లో ఈగలు, కీటకాలు తిరుగుతుండటంతో పాటు శనగ పిండి, గోధుమ పిండి, పప్పుల్లో అధికారులు పురుగులను గుర్తించారు. వంటకాల తయారీ కోసం ఉపయోగించే విభాగంలో కుళ్లిపోయిన కూరగాయలను నిల్వ ఉంచినట్లు గమనించారు. గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై తప్పుదారి పట్టించే లేబుళ్లను అంటించినట్లు తనిఖీల్లో వెల్లడైంది.
నాన్‌వెజ్ దుర్గంధం
మరోవైపు ఫ్రిజ్‌లలో పాత ఆహార పదార్థాలను నిర్వాహకులు నిల్వ ఉంచగా, అధికారులు వాటిని అక్కడికక్కడే పారవేయించారు. ఇక, నాన్-వెజ్ విభాగంలో మాంసం వ్యర్థాలతో డ్రైనేజీలు పూర్తిగా పూడిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తున్నట్లు గమనించి అధికారులు.. విక్రయదారులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు కొన్ని ఆహార పదార్థాలను గడువు ముగిసిన FSSAI లైసెన్స్‌తో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/sports-news/india-vs-afghanistan-series-squad-announcement-2026/
నాణ్యత లేమి
ఆహార తనిఖీల్లో భాగంగా దాదాపు 150 కిలోల నాణ్యత లేని స్వీట్లు, నూనెలు, పిండి, పప్పుధాన్యాలను అధికారులు స్వాధీనం చేసుకుని పూర్తిగా ధ్వంసం చేశారు. కృత్రిమ రంగులు, కల్తీ జరిగిందనే అనుమానంతో కొన్ని ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షల నిమిత్తం తరలించారు. ఆహార కల్తీ నేపథ్యంలో సూపర్ మార్కెట్లు, బేకరీలు, హోటళ్లలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్పష్టం చేశారు.

