ఉస్మానియా యూనివర్సిటీ (తెలుగు ప్రభ): మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో నలుగురికి జైలు శిక్ష, మరో 60 మందికి జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఎనిమిదో జేఎం ఎఫ్‌సీ (డ్రంక్ అండ్ డ్రైవ్) కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 64 మందిని కోర్టులో హాజరుపరచగా కేసులను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. మొత్తం రూ.3,33,400 జరిమానా విధించింది. పునరావృతంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన బికాస్ (30), ప్రభాత్ (29), ఎం.అనిల్ (24), సంగమేశ్వర్ (51)లకు జైలు శిక్షలు విధించింది. వీరిలో ముగ్గురికి 9 రోజుల సాధారణ జైలు, మరొకరికి ఒక రోజు సాధా రణ జైలు శిక్ష ఖరారు చేసింది.
Also Read: Sama Ranga Reddy: పేదల భూములు లాక్కుంటే ఉద్యమిస్తాం.. బీజేపీ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు..
కోర్టు పరిష్కరించిన కేసుల్లో 48 ద్విచక్ర వాహనాలు, 4 త్రిచక్ర వాహనాలు, 12 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. వీటిలో 2026 సంవత్సరానికి చెందిన 61 కేసులు, 2025, 2024, 2022 సంవత్సరాలకు చెందిన ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. మద్యం తాగి వాహనం నడపొద్దని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన అనంతరం వాహనం నడపకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు, చట్ట పరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

