సికింద్రాబాద్ (తెలుగుప్రభ) : అవయవ దానంపై ప్రజలలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే. సునీల్ కుమార్ అన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవం, అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలో ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…అవయవ దానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కిడ్నీ లేదా ఇతర అవయవాలు దానం చేస్తే దాతల ఆరోగ్యానికి ప్రమాదమని చాలామంది భావిస్తుంటారని, అయితే అది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దాతలు అవయవాలు దానం చేసి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
గాంధీ ఆస్పత్రి ఇప్పటివరకు 35కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయం సాధించి రికార్డు సృష్టించిందని డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లోనే రెండు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి ద్వారా కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు, క్లోమం వంటి అవయవాలను సేకరించి ఎనిమిది మందికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చని వివరించారు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగానే ప్రతిజ్ఞ (ప్లెడ్జ్) చేయాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, వైస్ ప్రిన్సిపల్స్, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు పూర్తి సహకారం అందించిన డిఎంఈ డాక్టర్ వాణికి ఆస్పత్రి వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి.

