Homeతెలంగాణహైదరాబాద్GHMC : క్రేన్ల ముసుగులో కరెన్సీ కక్కుర్తి.. జీహెచ్‌ఎంసీ టెండర్లలో భారీ మతలబు

GHMC : క్రేన్ల ముసుగులో కరెన్సీ కక్కుర్తి.. జీహెచ్‌ఎంసీ టెండర్లలో భారీ మతలబు

హైద్రాబాద్ ( తెలుగు ప్రభ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో టెండర్ల ప్రక్రియ మళ్లీ వివాదాలకు వేదికవుతోంది. ఏటా వినాయక చవితి శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్ల పేరుతో ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల జోళ్లలోకి గుమ్మరించడం పరిపాటిగా మారింది. గత వర్షాకాలంలో ఎమర్జెన్సీ వెహికల్స్‌ టెండర్లలో సాగిన లోపాయికారీ బాగోతమే ఇప్పుడు రాజేంద్రనగర్ సర్కిల్‌లో గణేశ్ నిమజ్జన క్రేన్ల కేటాయింపులో పునరావృతమవుతోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

తొలి టెండర్‌కు పాతర: రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని చెరువుల వద్ద నిమజ్జనం కోసం భారీ క్రేన్ల ఏర్పాటుకు రెండు వారాల క్రితం ఇంజినీరింగ్ విభాగం టెండర్లు ఆహ్వానించింది. సొంత క్రేన్లు లేదా లీజుకు తీసుకున్న క్రేన్లు ఉన్నవారు పాల్గొనవచ్చని తొలుత స్పష్టంగా పేర్కొన్నారు. గడువు ముగిసేవరకు ఎదురుచూసిన అధికారులు, కావాలనే ఆ టెండర్‌ను రద్దు చేశారు.

అనుకూలమైన వారికే రెండో నోటిఫికేషన్: గడువు ముగిసిన వెంటనే, కేవలం మూడు రోజుల క్రితం ఉన్నపళంగా మరో నోటిఫికేషన్ తెరపైకి తెచ్చారు. ఇందులో ‘సొంత క్రేన్లు ఉన్నవారు మాత్రమే అర్హులు’ అంటూ సరికొత్త కొర్రీ పెట్టారు. హైదరాబాద్ నగరంలో భారీ క్రేన్లను సొంతంగా నిర్వహించే కాంట్రాక్టర్లు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉంటారని తెలిసీ ఈ నిబంధన చేర్చడం గమనార్హం.

పారదర్శకతకు తూట్లు: నచ్చిన ఒకరిద్దరు గుత్తేదారులకే ఈ కాంట్రాక్టు దక్కేలా అధికారులు కుమ్మక్కయ్యారని ఇతర కాంట్రాక్టర్లు బహిరంగంగానే గళమెత్తుతున్నారు. పోటీని తుంగలో తొక్కి, ‘సింగిల్ టెండర్’ మాదిరిగా నిధులు దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేశారన్నది వారి ప్రధాన అభియోగం. పండుగ భక్తిని పక్కనపెట్టి, నిమజ్జన పనులను అక్రమార్జనకు మార్గంగా మలుచుకుంటున్న తీరుపై నిఘా విభాగాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పారదర్శకంగా ఈ-టెండర్లను పునఃసమీక్షించకపోతే న్యాయపోరాటం చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News