Homeతెలంగాణహైదరాబాద్Project Udvasan: “ప్రాజెక్ట్ ఉద్వాసన”కు విశేష స్పందన.. ఒక్కరోజులో 983.85 కిలోల దివ్య వ్యర్థాల సేకరణ

Project Udvasan: “ప్రాజెక్ట్ ఉద్వాసన”కు విశేష స్పందన.. ఒక్కరోజులో 983.85 కిలోల దివ్య వ్యర్థాల సేకరణ

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయాలకు గౌరవం కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన “ప్రాజెక్ట్ ఉద్వాసన”కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, లూప్ సస్టైనబిలిటీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేవాలయాల్లో వినియోగానికి అనర్హంగా మారిన పాత దేవతా చిత్రాలు, విరిగిన ఫోటో ఫ్రేములు, విగ్రహాలను శాస్త్రోక్తంగా సేకరించి, వాటిని సాధారణ చెత్త ప్రవాహంలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 3 జోన్ల పరిధిలో ఎంపిక చేసిన 8 దేవాలయాల్లో మొత్తం 983.85 కిలోల దివ్య వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు, భక్తుల విశ్వాసాలు, సాంప్రదాయాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన వ్యర్థ నిర్వహణకు మార్గం సుగమం అవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, స్థానిక పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ ఇళ్లలో ఉన్న పాత, విరిగిన దేవతా చిత్రాలు, ఫోటో ఫ్రేములు, భిన్నమైన విగ్రహాలను ప్రాజెక్ట్ ఉద్వాసనకు అందజేశారు.

udvasan

2.2 టన్నులకు పైగా దివ్య వ్యర్థాల సేకరణ…

ప్రాజెక్ట్ ఉద్వాసన ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 2.2 టన్నులకు పైగా దివ్య వ్యర్థాలను సేకరించినట్లు అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ఈ కార్యక్రమం పట్ల ఉన్న విశ్వాసాన్ని, సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

మిగతా 7 దేవాలయాల్లోనూ ఉద్వాసన పూజలు..

project udvasana

ఎంపిక చేసిన 8 దేవాలయాల్లోని మిగతా 7 దేవాలయాలలో సంబంధిత డిప్యూటీ కమిషనర్లు పాల్గొని ఉద్వాసన పూజా కార్య క్రమాలను నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దివ్య వ్యర్థాలను అందజేశారు. ‘భక్తి, సంప్రదాయం- పర్యావరణ పరిరక్షణ” అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఉద్వాసన ద్వారా, దేవతా చిత్రాలు, విగ్రహాలను గౌరవప్రదంగా నిర్వహించడంతో పాటు, వాటిని సాధారణ చెత్తలో కలవకుండా నిరోధించే చర్యలకు ఎంఎంసీ ప్రాధాన్యత ఇస్తోంది.

మున్ముందు కూడా మరిన్ని దేవాలయాలు, ప్రాంతాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించి, ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ హితమైన, సంప్రదాయాలను గౌరవించే దివ్య వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News