Homeతెలంగాణహైదరాబాద్Osmania University: ఓయూలో ఘనంగా బతుకమ్మ సంబురాలు.. పాల్గొన్న కల్వకుంట్ల కవిత

Osmania University: ఓయూలో ఘనంగా బతుకమ్మ సంబురాలు.. పాల్గొన్న కల్వకుంట్ల కవిత

ఉస్మానియా యూనివర్సిటీ (తెలుగు ప్రభ): యూనివర్సిటీలు నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. పీవీ నరసింహారావు, జార్జ్ రెడ్డి, గద్దర్, కిషన్ జీ, స్వర్ణక్క సహా రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ లలోని పలువురు ప్రముఖ నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే వచ్చారని ఆమె గుర్తుచేశారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కవిత ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థినులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.

- Advertisement -

ఉద్యమాల గడ్డ ఓయూ..

ఓయూ అనగానే తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుందని, తొలి, మలిదశ ఉద్యమాల్లో ఈ గడ్డ చేసిన పోరాటాన్ని తెలంగాణ నేలతల్లి ఎన్నటికీ మరవలేదని కొనియాడారు. ప్రపంచం మొత్తం దేవుడికి పూలు సమర్పిస్తే, తెలంగాణ ప్రజలు మాత్రం పూలనే దేవుడిగా పూజిస్తారని చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు యూనివర్సిటీలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు విద్యార్థులకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. గతంలో యూనివర్సిటీకి ఇస్తానన్న రూ.1000 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. ముఖ్యమంత్రి ముక్కు పిండి అయినా ఓయూకి ఆ నిధులు తెప్పిస్తామని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో మళ్లీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని, అప్పుడే యువతకు, పేద ఇంటి పిల్లలకు నాయకత్వ లక్షణాలు లభిస్తాయని అన్నారు. వర్సిటీల్లో స్వతంత్ర, ఉదార ఆలోచనా ధోరణి (Liberal Thinking) లేకపోతే కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నేతల పిల్లలే రాజకీయాల్లోకి వస్తారని వ్యాఖ్యానించారు. అవసరమైతే జంతర్ మంతర్ తరహాలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈవీఎంల రద్దుకు డిమాండ్: దేశంలో మార్చాల్సింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కాదని, ప్రధానమంత్రి మోదీని గద్దె దించి వ్యవస్థను మార్చాలని వ్యాఖ్యానించారు. మోసపూరిత ఈవీఎం విధానాన్ని పక్కనపెట్టి మళ్లీ పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News